Operation Sindoor | ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ హక్కుల కోసం బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఒకట్రెండు కాదు ఏకంగా 15 ప్రొడక్షన్ హౌస్‌లు ఈ టైటిల్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో దరఖాస్తు చేసుకోవడం విశేషం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ లక్ష్యాన్ని సాధిస్తున్నది. పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ దళాలు క్షిపణులతో ధ్వంసం చేస్తున్నాయి.
‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ భారతీయ సంస్కృతిని, స్త్రీ సంకల్పాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన టైటిల్ కావడంతో పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. మహావీర్ జైన్ ఫిల్మ్స్ ఈ టైటిల్ కోసం తొలి దరఖాస్తుని ఇచ్చిందని తెలిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, టీ-సిరీస్‌తో పాటు ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ సైతం టైటిల్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం.