Allu Arjun Arrest | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అల్లు అర్జున్ అరెస్టుపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేయించారంటూ నెటిజెన్స్ విమర్శనాస్ర్తాలు సంధించారు. పుష్ప సినిమా ఫంక్షన్లో రేవంత్‌రెడ్డి పేరు చెప్పనందుకు అరెస్ట్‌తో ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు. హైడ్రా కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు ఎవరు బాధ్యులు? ఎవరిని అరెస్ట్ చేయాలి? అని నిలదీశారు. విద్యార్థులు, రైతుల గోస పట్టించుకోని రేవంత్‌రెడ్డి పబ్లిసిటీ కోసం సినిమా వాళ్లను వాడుకుంటున్నారని కొందరు తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీ నుంచి వస్తున్న ఆదేశాలతోనే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని మరో నెటిజెన్ ఆరోపించారు. అర్జున్‌కు బెయిల్ రావడంతో పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చిన అర్జునుడు అంటూ కొందరు ఆనందం వ్యక్తంచేశారు. జైలుకు వెళ్లి వచ్చిన వారితో ఇదే సమస్య.. అందరిని జైలుకు పంపాలని చూస్తాడు, కలెక్షన్స్‌లో కమీషన్ పంపలేదా పుష్పా, పుష్ప వడ్డీతో వసూలు చేస్తాడు.. తగ్గేదేలే, సీఎంను మార్చాల్సిన సమయం వచ్చింది, కొండా సురేఖ టాలీవుడ్‌ను ఏకం చేస్తే.. రేవంత్ ఆలిండియా యాక్టర్స్‌ను ఏకం చేశాడు.. ఇక కాంగ్రెస్‌కు, రాహుల్‌కు మంచి రోజులే అంటూ రకరకాలుగా సెటైర్లు వేశారు. లోక్‌సభలో ప్రియాంకగాంధీ మొదటి ప్రసంగం వినకుండా చేసిన రేవంత్‌రెడ్డి బీజేపీ సపోర్టర్ రేవంత్ అని కొందరు నెటిజెన్స్ కామెంట్ పెట్టారు.