Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ నటుడి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం, కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల ఈ అంశంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో, ఒక యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తిగా అవాస్తవమైన, అభ్యంతరకర కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఈ వీడియోలు, ఫోటోలు అభిమానుల్లో ఆందోళన కలిగించేలా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయని తెలిపారు.
ఫిర్యాదుతో పాటు వీడియో లింకులు, స్క్రీన్షాట్లు వంటి డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు. ప్రాథమిక విచారణ అనంతరం కోర్టు అనుమతితో పోలీసులు సంబంధిత యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.