‘రచయిత చింతకింద శ్రీనివాసరావు ఈ ‘ఘాటి’ల గురించి నాకు చెప్పారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో శీలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఓ వ్యవస్థ పనిచేస్తుంది. వాటిని మోసేందుకు కూలీలుంటారు. వారిని ఘాటీలంటారు. వారిపై చింతకింద శ్రీనివాసరావు ఓ 30 పేజీల కథ రాశారు. దాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాను. లొకేషన్ సెర్చింగ్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఓ కొత్త ప్రపంచం. వారి జీవన శైలి కొత్తగా అనిపించింది. ఓ కొత్త కల్చర్‌ని చూపించే ఆస్కారం వుండటంతో ‘ఘాటి’ మొదలుపెట్టాను.’ అని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో అనుష్క కథానాయికగా రూపొందిన చిత్రం ‘ఘాటి’. విక్రమ్‌ప్రభు మేల్ లీడ్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం క్రిష్ విలేకరులతో మాట్లాడారు. ‘ ‘వేదం’ తర్వాత అనుష్కతో చేసే కథ ఓ మంచి ఆర్గానిక్‌గా ఉండాలని భావించా. దాని కోసం వెతికే క్రమంలో దొరికన కథే ‘ఘాటి’.
ఇందులో శీలావతిగా అనుష్క గ్రేస్, ఆటిట్యూడ్ తన సూపర్స్టార్డమ్కు పర్ఫెక్ట్ యాప్ట్.’ అని తెలిపారు క్రిష్. ఇంకా చెబుతూ ‘ఘాటి’ పూర్తిగా ఫిక్షన్. కమర్షియల్ యాక్షన్‌తో కేవలం అనుష్క కోసం చేసిన బిగ్ స్కేల్ మూవీ ఇది. అయితే.. మనందరం ఎదుర్కొంటున్న ఓ సమస్య నిర్మూలనకు ఈ కథ ఊతమిస్తుంది. ఇందులో తీవ్రమైన భావోద్వేగాలుంటాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా ఎమోషన్స్ కనిపిస్తాయి. ’ అని పేర్కొన్నారు క్రిష్. హీరో దేశిరాజుగా విక్రమ్ ప్రభు, విలన్ కందుల నాయుడుగా చైతన్యరావు, కాష్టాల నాయుడుగా రవీంద్ర విజయ్ పాత్రలు హైలైట్‌గా నిలుస్తాయి. ఈ సినిమా సాంకేతికంగా ఓ అద్భుతమనే చెప్పాలి. డీవోపీ మనోజ్ విజువల్స్, సాగర్ సంగీతం, విస్తృతమైన విషయాన్ని అందంగా చెప్పే సాయిమాధవ్ బుర్రా సంభాషణలు.. ఇలా అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుంటుంది. అనుష్క సినిమా బావుంటే.. దాన్ని రేంజ్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు నిరూపించాయి. ఈ ‘ఘాటి’తో అది మరోమారు రుజువుకానుంది.’ అని క్రిష్ నమ్మకం వెలిబుచ్చారు.