బోయపాటి శ్రీను (Boyapati Srinu), నందమూరి బాలకృష్ణ (Balakrishna), ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హ్యాట్రిక్ కాంబినేషన్ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వేటలో మునిగిపోతుంది. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన అఖండ చిత్రమే దీనికి ఉదాహరణ. అఖండ 100 రోజులు (Akhanda 100 days). విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కర్నూలులో బాలకృష్ణ, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు.
తాము గతంలో సక్సెస్ మీట్‌ను కర్నూలులో పెట్టాలనుకున్నామని, అయితే కోవిడ్ నిబంధనలతో పెట్టలేకపోయామని చెప్పారు మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ.. బాలకృష్ణతో చేసిన ప్రతీ సినిమా ప్రయోగమే అని, అవి బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయని చెప్పారు. బాలకృష్ణతో నాది 13 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం. బాలకృష్ణ అభిమానులే కాదు..ఇతర హీరో అభిమానులు కూడా అఖండకు తమ మద్దతు ప్రకటించారు.
రాయలసీమ వాళ్లకు సినిమా నచ్చితే ప్రపంచంలో అందరికీ నచ్చుతుంది. సీమవాసులకు కమర్షియల్ సినిమాలపై అంత అవగాహన ఉందని అన్నాడు. బాలకృష్ణ అఖండ సినిమా 100 రోజులు జరుపుకుంటున్న 4 సెంటర్లలో మూడు కర్నూలుకు చెందినవి. ఆయన కేవలం సినిమాలు, రాజకీయాలు మాత్రమే కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ..ఆయన వారసత్వాన్నిమోస్తున్నారని బోయపాటి అన్నాడు.