తెరపై మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి కొందరు కథానాయికలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోవడం మామూలు విషయమే. ఇప్పటికే పలువురు అగ్ర తారలు సర్జరీల ద్వారా తమ అందాలకు మెరుగులుదిద్దుకున్నారు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటుతూ గ్లోబల్‌స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంకచోప్రా సైతం కెరీర్ తొలినాళ్లలో తన ముక్కుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందట.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘ సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో నా ముక్కు రూపం నచ్చేది కాదు. దాంతో సర్జరీ చేయించుకున్నా. అయితే బ్యాండేజ్ తొలగించి తొలిసారి నా ముఖాన్ని చూసుకున్నప్పుడు భయపడ్డాను. వేరెవరినో చూస్తున్నాననే భావన కలిగింది. అనవసరంగా సర్జరీ చేయించుకున్నానని బాధపడ్డాను. అయితే కొన్ని రోజుల తర్వాత అంతా సర్దుకుంది. నా కొత్త రూపానికి అలవాటుపడ్డాను’ అని చెప్పుకొచ్చింది. ఆమె నటించిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.