‘మా కుటుంబం మొత్తం ఈ కథకు కనెక్ట్ అయింది. అలాగే ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. అంతా కొత్తవాళ్లతోనే ఈ సినిమా చేయాలని ఆరునెలలు ఆడిషన్స్ చేశాం. ఇందులో రియల్ ఫ్రెష్ ఫేసెస్ మీకు కనిపిస్తాయి. ఇది కౌమారదశలో ఉన్నవాళ్ల కథ. అందుకే టీనేజర్లనే సెలక్ట్ చేశాం. ‘పొన్నియన్ సెల్వన్’లో సారా అర్జున్ని చూసి, తనుంటేనే ఈ సినిమా చేద్దామని మా అమ్మాయి చెప్పింది. వెంటనే వాళ్ల నాన్నకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాం.
ఇందులో సారాకు అమ్మగా భూమిక నటిస్తున్నది. ఫిబ్రవరి 6న సినిమా విడుదల చేయనున్నాం. అందరూ కుటుంబాలతో కలిసి చూడండి.’ అని గుణశేఖర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న యువతరం సినిమా ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ధురంధర్’ఫేం సారా అర్జున్, భూమిక, గౌతమ్ వాసుదేవ మీనన్లతోపాటు చాలామంది నూతన నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గుణశేఖర్ మాట్లాడారు. ఇంకా నిర్మాత నీలిమ గుణ, భూమిక, సారా అర్జున్, అడ్డాల పృథ్వీరాజ్, విఘ్నేష్ గవిరెడ్డి కూడా మాట్లాడారు. మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకొని విచక్షణ కోల్పోతున్న యువత ఎలా నేరాల బాట పడుతున్నారో ఈ ట్రైలర్ చూపించింది. సినిమా ఇంతకు మించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: నాగేంద్ర కాశీ, కృష్ణ హరి.