Betting | ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. కురాకో దేశంలో నమోదైన వివాదాస్పద ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ వన్ ఎక్స్‌బెట్ (1xBet) ప్రమోషన్లకు సంబంధించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పలు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. పీఎంఎల్ఏ (PMLA) చట్టం కింద ఈ చర్యలు చేపట్టబోతున్నట్టు సమాచారం.ఈ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు , పలువురు ప్రముఖుల పేర్లు ఈడీ రాడార్‌లో ఉన్నాయని తెలుస్తోంది.
ప్రమోషన్ల ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని చాలామంది విలాసవంతమైన ఆస్తుల కొనుగోలు కోసం వాడుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈడీ, వాటిని క్రిమినల్ ఇన్కమ్గా పరిగణిస్తూ, ఆస్తులపై తాత్కాలికంగా అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీ చేసే దిశగా పకడ్బందీగా పని చేస్తోంది. ఈడీ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, ఈ సెలబ్రిటీలకు భారతదేశంతో పాటు యూఏఈ వంటి విదేశాల్లో కూడ స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఆస్తులపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తూ, వాటిని తాత్కాలికంగా అటాచ్ చేయడానికి అవసరమైన ఆమోదం కోసం PMLA అథారిటీకి ఆర్డర్ పంపించనున్నట్టు సమాచారం. ఆమోదం లభించిన తర్వాత ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసి, కోర్టు అనుమతి పొందిన తర్వాత ఆస్తులను శాశ్వతంగా జప్తు చేసే అవకాశముంది.
ఈడీ ప్రశ్నించిన సెలబ్రిటీల జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరిలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప, శిఖర్ ధావన్,నటుడు సోను సూద్,బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా,తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి,అలాగే ఉర్వశి రౌతేలా ఉన్నారు. అయితే భారత ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ, నిషేధానికి ముందు దాదాపు 22 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు కనెక్ట్ అయ్యారని అంచనా. వీరిలో సగం మంది యాక్టివ్ యూజర్లు కావడం ఆశ్చర్యకరం.ఇప్పటికే విచారణలు ప్రారంభించడంతో పాటు ఆస్తుల జప్తు ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో, పలువురు సెలబ్రిటీలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సమాచారం. ప్రత్యక్షంగా ప్రమోట్ చేసిన వారు మాత్రమే కాదు, సంబంధిత సంస్థల నుంచి డబ్బు స్వీకరించిన వారు కూడా విచారణకు హాజరు కావలసి ఉంటుంది.