హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుకు (Mahesh Babu) ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంటూ తాఖీదులిచ్చింది. సాయిసూర్య, సురానా గ్రూప్ వ్యవహారంలో మహేశ్‌కు నోటీసులు జారీచేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టులకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్నవిషయం తెలిసిందే. ఇందుకుగాను సాయి సూర్య డెవలపర్స్ నుంచి రెమ్యూనరేషన్‌గా రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ.3.5 కోట్లు నగదు రూపంలో, రూ.2.5 కోట్లు ఆర్టీజీఎస్ ట్రాన్స్పర్ జరిగినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మహేశ్‌పై ఈడీ అభియోగాలు మోపింది.
సురానా గ్రూపునకు చెందిన భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ నరేంద్ర సురానా, అనుబంధ సంస్థ అయిన సాయిసూర్య డెవలపర్స్ యజమాని సతీశ్‌చంద్ర గుప్తా పక్కా పథకం ప్రకారం పలువురిని మోసం చేసినట్లు ఈడీ విచారణలో గుర్తించారు. సొంతింటి కోసం బయానాలు ఇచ్చిన పలువుర్ని వంచించినట్లు తేల్చారు. ఈ రెండు కంపెనీల ద్వారా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు అమ్మారని, ఒకే ప్లాట్‌ను బైనంబర్ల ద్వారా పలువురికి రిజిస్ట్రేషన్లు చేశారని, సరైన అగ్రిమెంట్లు లేకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని విచారణలో గుర్తించారు.
ఇలా రూ.100 కోట్లకు పైగా నల్లధనాన్ని సేకరించి, ఆ డబ్బును వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీలపై హైదరాబాద్‌లోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో తాము ఈసీఎన్ఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సోదాల్లో రూ.74.50 లక్షల నగదు, రూ.100 కోట్ల నల్లధనానికి సంబంధించిన లెక్కలు గుర్తించామని చెప్పారు. నరేంద్ర సురానా కార్యాలయం నుంచి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక సతీశ్‌చంద్రపై ఇప్పటి వరకు పలు పోలీస్ స్టేషన్లలో 11 కేసులు నమోదైనట్లు చెప్పారు.