Betting Apps Promotion Case | అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్లో ఇంకా కలకలం రేపుతునే ఉంది. తాజాగా ఈ కేసులో ప్రముఖ నటి నిధి అగర్వాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన కేసులో భాగంగా మనీలాండరింగ్ ఆరోపణలపై బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగింది.
విచారణ వివరాల ప్రకారం.. ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులకు స్పందించి నటి స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ఆమె కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రచార కార్యక్రమాలకు తీసుకున్న భారీ పారితోషికం, ఆర్థిక లావాదేవీల తీరుతెన్నులపై అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ చెల్లింపులు ఏయే మార్గాల ద్వారా జరిగాయి? హవాలా రూపంలో నగదు బదిలీ జరిగిందా అనే కోణంలో ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఇప్పటికే దాదాపు 21 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగానే కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఐడీ ఎదుట కూడా నిధి అగర్వాల్ హాజరై తన వాంగ్మూలాన్ని సమర్పించారు. ప్రస్తుతం మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.