బెంగళూరు: కాంక్రీట్ అరణ్యం బెంగళూరు నడిబొడ్డున పర్యావరణ హితకరమైన ఇంటిని చూసినవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేటర్ ప్రియం సారస్వత్ పోస్ట్ చేసిన తమ ‘శ్వాసించే ఇల్లు’ వీడియోను 22 లక్షల మంది చూశారు. రణగొణ ధ్వనులతో నిండిన నగర జీవితంలో ప్రశాంతతను ఆస్వాదిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఈ ఇంటి మట్టి గోడల్లో వేస్ట్ బాటిల్స్‌ను అమర్చారు. నీటి కోసం చేతి పంపును ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇంటి లోపల సహజంగా ఓ నీటి గుంటను నిర్మించారు.
ఈ నీటి గుంటతోపాటు ‘శ్వాసించే’ మట్టి గోడల వల్ల ఉష్ణోగ్రతలు సమతాస్థితిలో ఉంటాయని సారస్వత్ దంపతులు చెప్పారు. ఎయిర్ కండిషనింగ్ ఉపకరణాల అవసరం ఉండదన్నారు. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన 150 ఏండ్ల నాటి తలుపును భోజనాలు చేసే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. మట్టి కుండలను పైకప్పుపై బోర్లించి పెట్టారు. ఈ ఇంటికి ‘సత్య చిత్’ అని నామకరణం చేసుకున్నారు. ధ్యానం, కలిసి మెలిసి జీవించే తత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా ఈ ఇంటిని తీర్చిదిద్దారు.