రవితేజ ‘ఈగల్’ చిత్రం సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 13న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే సంక్రాంతి సీజన్లో థియేటర్స్ లభ్యతలో కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, పరిశ్రమ క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. ఓ జనరంజకమైన చిత్రాన్ని చూడటానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. అందుకే వాయిదా నిర్ణయం తీసుకున్నాం. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీర్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా, సంగీతం: డేవ్ జాంద్, ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.