Dulquer Salmaan | మలయాళంతో సమానంగా తెలుగు సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు నటుడు దుల్కర్ సల్మాన్. తెలుగులో ఆయన చేసిన మహానటి, సీతారామం, రీసెంట్ పానిండియా హిట్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం దుల్కర్ చేస్తున్న తెలుగు సినిమా ‘లక్కీభాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. 1980-90 మధ్య కాలంలో అసాధారణ విజయాన్ని సాధించిన ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్ ప్రయాణమే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. దుల్కర్ కెరీర్లో చిరస్మరణీయంగా నిలిచే పాత్ర ఇదని మేకర్స్ చెబుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. దుల్కర్సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ట్రాక్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ‘శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా..’ అంటూ సాగే పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, జి.వి.ప్రకాశ్‌కుమార్ స్వరపరిచారు. ఉషా ఉతుప్ ఆలపించారు.
సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఇదేరోజున దుల్కర్ తెలుగులో చేస్తున్న తాజా సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సినిమా పేరు ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకుడు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగానే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌లో దుల్కర్ రైతులా కనిపిస్తున్నారు. పోస్టర్లో ఓ పాప కూడా స్కూల్ బ్యాగ్‌తో కనిపిస్తున్నది. దీన్ని బట్టి ఇది ఛైల్డ్ సెంటిమెంట్ మూవీ అని చెప్పొచ్చు. గీతాఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. మొత్తానికి తెలుగు హీరోలతో సమానంగా బిజీ అయిపోయారు దుల్కర్.