సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ దొరసాయి తేజ (Dorasai Teja) ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన బండి భగీరథ్ అంశంపై స్పందిస్తూ అతడికి అనుకూలంగా ఒక వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో నెట్టింట తీవ్ర వివాదానికి, విమర్శలకు దారి తీయడంతో సాయితేజ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా ఆ వివాదాస్పద వీడియోను సోషల్ మీడియా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు దొరసాయి తేజ తన ఇన్స్టాగ్రామ్ (IG) వేదికగా ప్రకటించారు.
గత 15 సంవత్సరాలుగా నా ప్రయాణం మొత్తం మీ అందరి ముందే జరిగింది. నా ఎదుగుదల, కష్టాలు, విజయాలు ప్రతి దశలోనూ మీరే నాకు బలంగా నిలిచారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీ ప్రేమ, నమ్మకమే కారణం. ఇటీవల బండి భగీరథ్ అంశంపై నేను చేసిన ఒక చిన్న వీడియోను కొంతమంది స్వార్థపూరిత కోణంలో చూస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలోనే నేను స్పష్టంగా ఒక మాట చెప్పాను ఒకవేళ భగీరథ్ తప్పు చేసి ఉంటే, చట్టప్రకారం అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని అన్నాను. కానీ, ఆ మాటలను పక్కన పెట్టి, కొన్ని క్లిప్స్‌ను మాత్రమే కట్ చేసి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వివరణ ఇచ్చారు.
తాను ఎప్పుడూ తప్పును సమర్థించలేదని, సమర్థించబోనని ఆయన స్పష్టం చేశారు. “నిజం ఏదైతే అది చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ వీడియో చేశాను. సోషల్ మీడియా నాకు కేవలం సరదా కాదు, ఇది నా జీవితం, నా కుటుంబానికి ఆధారం. 15 సంవత్సరాల కష్టం మీద సంపాదించుకున్న గౌరవాన్ని ఒకే ఒక్క వీడియోతో పణంగా పెట్టలేను. ఈ అంశం ఎంత సున్నితమైనదో గుర్తించి, ఇకపై ఎలాంటి అపోహలు రాకూడదనే ఉద్దేశంతో నా అభిప్రాయంతో ఉన్న ఆ వీడియోను తొలగిస్తున్నాను. ఒక చిన్న క్లిప్ చూసి నా 15 ఏళ్ల ప్రయాణాన్ని జడ్జ్ చేయకండి. నన్ను మొదటి నుండి ఫాలో అవుతున్న వారికి నా ఉద్దేశం ఏంటో బాగా తెలుసు. నాపై ప్రేమ, నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని దొరసాయి తేజ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.