నగర జీవితానికి అలవాటుపడటంతో మన మూలాలను మరచిపోతున్నామని, అందరినీ కాలం వెనక్కి తీసుకెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చే ఉద్దేశ్యంతో 90వ దశకం నేపథ్యంలో ఈ సినిమా తీశామని చెప్పారు ‘దూరదర్శిని’ చిత్ర హీరో సువిక్షిత్. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి కార్తికేయ కొమ్మి దర్శకుడు. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరో సువిక్షిత్ విలేకరులతో ముచ్చటించారు.
చిత్ర రచయిత నారాయణ అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవితకథ ఆధారంగా ఈ కథ రాసుకున్నారని, 90దశకంలో నడిచే ఈ కథ నాటి మధురజ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుందన్నారు. తన పాత్ర చాలా సహజంగా ఉంటుందని, ఈ కథలో నాయకానాయికలు చనిపోతారని, అయినా కథ సుఖాంతమే అవుతుందని..అదే సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని సువిక్షిత్ చెప్పారు. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లోని సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, ప్రతి ఒక్కరికి వారి సొంతూరిని గుర్తుకుతెస్తుందని, దాదాపు 250 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని సువిక్షిత్ పేర్కొన్నారు.