ప్రపంచ దేశాల ఉత్పత్తులపై సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వినోద రంగంపై కొరడా ఝళిపించారు. అమెరికా వెలుపల నిర్మాణం జరుపుకొని అక్కడ విడుదలయ్యే ఏ చిత్రానికైనా వందశాతం సుంకం విధించాలని యోచిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ సినీరంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా బాక్సాఫీస్‌లో తెలుగు సినిమాకు గణనీయమైన వాటా ఉంది. ట్రంప్ నిర్ణయంతో అక్కడి తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మొత్తం కుదేలయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trump Tariffs | అమెరికా మార్కెట్లో 30 శాతం వాటా తెలుగు సినిమా ఓవర్సీస్ రెవెన్యూలో 80 శాతానికిపైగా అమెరికా నుంచే వస్తున్నదని ట్రేడ్ వర్గాల అంచనా. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 వంటి చిత్రాలు అక్కడ భారీ వసూళ్లను సాధించాయి. తెలుగు సినిమా గ్రాస్ కలెక్షన్స్‌లో అమెరికా నుంచి వచ్చే ఆదాయం 25-30 శాతం మేరకు ఉంటుందని చెబుతారు.
ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాల పట్ల అమెరికా డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. ట్రంప్ వందశాతం టారిఫ్ నిర్ణయంతో అక్కడ తెలుగు సినిమా పంపిణీ ఇక ఆర్థికంగా ఏమాత్రం లాభసాటి కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారతీయ చిత్రాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ట్రంప్ తాజా నిర్ణయంతో ఆందోళనకు గురవుతున్నారు. డీల్ పూర్తి చేసుకున్న చిత్రాలు సుంకాలు కట్టాల్సివస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఆ నష్టాలను భరించలేరని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సినిమా కంటెంట్ ప్రొడక్షన్లో ఇండియా గ్లోబల్ పవర్‌గా ఎదుగుతున్న తరుణంలో ట్రంప్ నిర్ణయంతో సినిమా వ్యాపార సమీకరణాలు మారిపోతాయని అంటున్నారు.
అమెరికా ప్రొడక్షన్ సంస్థలు బయట దేశాల్లో తమ సినిమాలను నిర్మించడం ‘జాతీయ భద్రతకు’ సంబంధించిన అంశమని ట్రంప్ తన ట్విట్టర్ స్టేట్మెంట్లో ఆరోపించారు. ‘ఇతర దేశాలు అనేక ప్రోత్సాహకాలతో హాలీవుడ్ సినిమాను ఆకర్షిస్తున్నాయి. దాంతో ఇక్కడ సినిమా క్షీణదశకు చేరుకుంది. ఇది జాతి ప్రతిష్టకు సంబంధించిన అంశం. అందుకే వందశాతం సుంకాల విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్‌ను ఆదేశిస్తున్నా. అమెరికాలో మరలా సినీ నిర్మాణం పుంజుకోవాలన్నదే నా అభిమతం’ అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల పాలిట శరాఘాతంగా మారనుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
హాలీవుడ్లో పెద్ద నిర్మాణ సంస్థలైన మార్వెల్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ వంటి సంస్థలు ఎక్కువగా తమ చిత్రాలను లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో తెరకెక్కిస్తున్నాయి. మిషన్ ఇంపాజిబుల్-ది ఫైనల్ రెకానింగ్, అవెంజర్స్: డూమ్స్ డే, అవతార్-3 వంటి చిత్రాలు వివిధ దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలపై కూడా వందశాతం సుంకం విధిస్తారా? అసలు విదేశీ సినిమాను ఏ అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తారనే విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి.
ట్రంప్ నిర్ణయం వినాశకరమైన చర్య అని బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అభిప్రాయపడ్డారు. వందశాతం సుంకాల టారిఫ్ అమలైతే అమెరికాలో పది డాలర్లకు లభించే టికెట్ 20 డాలర్లు అవుతుందని, అంత ధరతో అక్కడ ఎవరూ సినిమాలు చూడరని ఆయన అన్నారు. సీనియర్ దర్శకనిర్మాత ముఖేష్‌భట్ ట్రంప్ నిర్ణయాన్ని ‘పెద్ద జోక్’ అంటూ కొట్టిపడేశారు. ట్రంప్ వందశాతం సుంకాల విధింపు బ్యాక్‌ఫైర్ అవుతుందని, హాలీవుడ్ సినిమాకే అది ఎక్కువ నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
వందశాతం టారిఫ్ అమలు జరిగితే తెలుగు చిత్రాల డిస్ట్రిబ్యూషన్‌కు ఎవరూ ముందుకురారని, అమెరికాలో తెలుగు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మొత్తం కనుమరుగు అవుతుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. గత కొన్నేళ్లుగా పఠాన్, ఆర్ఆర్ఆర్, డంకీ, జవాన్, సలార్, కల్కి, పుష్ప-2 వంటి చిత్రాలు అమెరికాలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. ఉత్తర అమెరికాలో తెలుగు సినిమాలకు విపరీతంగా క్రేజ్ ఉంటుంది. అక్కడ భారత్ కంటే ఒకరోజు ముందుగానే సినిమా విడుదల చేస్తారు. అక్కడ వచ్చే టాక్ ఇండియాలో బాక్సాఫీస్ వసూళ్లను పెంచేందుకు దోహదపడుతున్నది.
ట్రంప్ తాజా నిర్ణయం థియేటర్ రిలీజ్ వరకేనా? లేకా ఓటీటీలకు కూడా వర్తిస్తుందా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఓటీటీ చిత్రాలకు కూడా సుంకాలను వర్తింపజేస్తే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి పాపులర్ ఓటీటీ వేదికలు భారత్‌లో తమ పెట్టుబడులను తగ్గించుకుంటాయి. దాంతో నిర్మాతలకు డిజిటల్ రైట్స్ నుంచి వచ్చే లాభాలు తగ్గిపోతాయి. అయితే ట్రంప్ వందశాతం టారిఫ్‌పై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగనందున కొద్దికాలం వేచిచూస్తే ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుందంటున్నారు.