Tollywood | ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన భరోసా ఇది! ధర్మాన్ని కాపాడటానికి తాను ప్రతి యుగంలో అవతరిస్తానని గీతాచార్యుడి బోధ. ఆ నమ్మకంతోనే సినిమాను ఉద్ధరించడానికి దైవాన్ని నమ్ముకుంటున్నారు దర్శక, నిర్మాతలు. గతంలో పురాణేతిహాసాలను చిత్రాలుగా మలిచి హిట్లు కొట్టారు. సోషియో ఫాంటసీ ఫార్ములాతోనూ లబ్ధిపొందారు. ఈ సూత్రాన్నే కాలానుగుణంగా మార్చి దేవుణ్ని సినిమాలో కీలక పాత్రధారిని చేస్తున్నారు. దైవాన్ని మానుష రూపంలో చూపించి.. కొత్తదనంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిన్నటికి నిన్న రిలీజైన పవన్, సాయిధరమ్ తేజ్ ‘బ్రో’ సినిమా సైతం ఈ తరహా చిత్రమే! ఈ సందర్భంగా తెలుగు వెండితెరపై మెరిసిన వేల్పుల సంగతులు చదివేద్దాం..
సోషియో ఫాంటసీ చిత్రాలు తెలుగు తెరకు సుపరిచితాలే! బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఈ ట్రెండ్ నడుస్తున్నదే! 1960లో ఎన్టీఆర్ హీరోగా విడుదలైన ‘దేవాంతకుడు’ సినిమాది ఈ తరహా కథే. అయితే, ఇందులో నరుడు నరకలోకానికి వెళ్లడం, పనిలో పనిగా స్వర్గం, కైలాసం, వైకుంఠం తిరగడం కాగల కార్యాన్ని తీర్చుకొని రావడం జరుగుతుంది! 1970లో వచ్చిన ‘యమలోకపు గూఢచారి’ చిత్రంలో నరకానికి వెళ్లిన ఒక శునకం హత్య వెనుక రహస్యాన్ని ఛేదించడానికి యముడు అంగీకరిస్తాడు. ఆ శునకాన్ని మనిషిగా మార్చి, అతనికి తోడుగా యమభటులను మనుషుల రూపంలో భూమిపైకి పంపుతాడు. ఐదు దశాబ్దాల కిందట ఇలాంటి కథాంశంతో సినిమా నిర్మించడం విచిత్రమే! తర్వాతి కాలంలోనూ ఇలాంటి చిత్రాలు రూపుదిద్దుకున్నాయి.
తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను సమవర్తి దౌడు తీయించాడు. నరకాధిపతిని ప్రధాన పాత్రధారిగా మలిచి యమరాట్టును తెలుగువారి సినీ సమ్రాట్టుగా మార్చారు మనవాళ్లు. 1977లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘యమగోల’ సంచలన విజయం సాధించింది. యమధర్మరాజుగా సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య భూలోకానికి రావడం, ఇక్కడ పడరాని పాట్లు పడటం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో ‘యముడికి మొగుడు’, ‘యమలీల’, ‘యమ జాతకుడు’, ‘యమగోల మళ్లీ మొదలైంది’ తదితర చిత్రాలు యముడిని టాలీవుడ్ టాల్స్టార్ను చేశాయి. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘యమదొంగ’ కలెక్షన్ల సునామీ సృష్టించింది. రవితేజ హీరోగా వచ్చిన ‘దరువు’ కూడా యముడి చుట్టూ తిరిగిన కథే!
తెలుగువారి కృష్ణుడు అంటే ఎన్టీఆరే! హరనాథ్, కాంతారావు, శోభన్‌బాబు కృష్ణుడి పాత్రలో తళుక్కుమన్నా.. దాదాపు అన్నీ పౌరాణికాలే! దర్శక దిగ్గజం బాపు డైరెక్షన్లో ఏయన్నార్ ద్విపాత్రాభినయంతో వచ్చిన చిత్రం ‘బుద్ధిమంతుడు’. ఇందులో పెద్ద ఏయన్నార్ పాత్రధారి పిలిస్తే కృష్ణుడు ప్రత్యక్షమవుతుంటాడు. ఎవరికీ కనిపించని కృష్ణుడు పిలిచిన వ్యక్తికి మాత్రం కనిపిస్తాడు. అలా కనిపించే కృష్ణుడి పాత్రలో శోభన్‌బాబు నటించాడు. ‘నను పాలింపగ నడిచీ వచ్చితివా.. మొరలాలించగ కదలీ వచ్చితివా..’ పాట ఎప్పటికీ హిట్టే! నవ్వులరేడు రాజేంద్రప్రసాద్ హీరోగా 1993లో విడుదలైన సినిమా ‘కన్నయ్య కిట్టయ్య’. ఇందులో కిట్టయ్యగా, కృష్ణుడు (కన్నయ్య)గా రాజేంద్రప్రసాద్ కనిపిస్తాడు. కృష్ణుడు మనిషైన కిట్టయ్యగా నటించాల్సి రావడం, ఆయన్ను వెతుక్కుంటూ రుక్మిణీ, సత్యభామ, నారద మహర్షి రంగ ప్రవేశం చేయడం ఇలా చిత్రవిచిత్రమైన మలుపులతో సినిమా సాగుతుంది. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది.
దారితప్పితే దండధారినీ దండించే ముక్కంటి శివుడు కూడా తెలుగు తెరకు చిరపరిచితుడే! 1979లో సత్యనారాయణ, రావు గోపాలరావు ప్రధాన పాత్రలుగా రూపుదిద్దుకున్న ‘మా ఊళ్లో మహాశివుడు’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇందులో శివుడి పాత్రలో రావు గోపాలరావు అద్భుతంగా నటించి అలరించాడు. సాధారణ మనిషిలా కాకుండా కరి చర్మం కట్టుకొని, కాల నాగులు చుట్టుకొని, త్రిశూలంతో తిరుగాడుతూ సత్యనారాయణ పాత్రకు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. వారిద్దరి మధ్యా జరిగే సంభాషణలు ఆనాటి వ్యవస్థకు, మానవీయ విలువలు ఎలా దిగజారిపోతున్నాయో అద్దం పడతాయి.
కైలాస నాథుడు మానవ మాత్రుడిగా దర్శనమిచ్చిన మరో సినిమా ‘డమరుకం’! నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా 2012లో విడుదలైంది. ఇందులో సాంబయ్య (శివుడు)గా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తాడు. సెమీ సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
కొన్నేండ్లకు ముందు టాలీవుడ్లో నాగదేవతల హవా జోరుగా నడిచింది. ‘నాగమ్మ, ‘నాగదేవత’, ‘నాగబాల’, ‘దేవి’ తదితర చిత్రాలన్నీ దేవుళ్లను భూలోకానికి మానవ మాత్రులుగా రప్పించి మెప్పించినవే! దేవుడు దిగివచ్చి కథను నడిపించిన మరో చిత్రం ‘శ్రీ ఆంజనేయం’. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆంజనేయస్వామిగా అర్జున్ మనిషిగా కనిపిస్తాడు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని కథానాయకుడిని ముందుకు నడిపిస్తాడు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది.
మళ్లీ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత దేవుడు మనిషి సక్సెస్ కొట్టిన సినిమా ‘గోపాల గోపాల’. వెంకటేశ్, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. పరేశ్ రావల్, అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్’ హిందీ చిత్రానికి ఇది రీమేక్. దేవుడైనప్పటికీ సాధారణ వ్యక్తిగా ప్రవర్తించే పాత్రలో పవర్‌స్టార్ కనిపించడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. సాధారణంగా దేవుడు అనగానే కాస్త గ్రాంథిక భాషలో సంభాషణలు పలికించడం మనవారి రివాజు. కానీ, దానికి భిన్నంగా ఆహార్య వ్యవహారాల్లో, సంభాషణల్లోనూ కామన్‌మ్యాన్‌గా ఇందులో చూపించారు. మొత్తంగా ‘గోపాల గోపాల’ ఇలాంటి చిత్రాలకు కొత్త ఊపునిచ్చింది.
విశ్వక్సేన్, వెంకటేశ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఓరి దేవుడా’! జీవిత భాగస్వామితో విడిపోయేందుకు సిద్ధపడ్డ ఓ యువకుడికి దేవుడు ఎలా సాయం చేశాడన్నది ఈ కథ ఇతివృత్తం. ఈ చిత్రం ఆశించినంతగా ఆదరణకు నోచుకోలేదు. తాజాగా పవన్ మరోసారి దేవుడిగా వెండితెరపై ప్రత్యక్షమయ్యాడు. దర్శకుడు సముద్రఖని కాన్సెప్ట్‌కు పవన్ అతికినట్టు సూటయ్యాడని ప్రేక్షకుల స్పందన. ‘గాడ్’ కాన్సెప్ట్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ తరహా చిత్రాలు మరిన్ని మనల్ని పలకరిస్తాయేమో చూడాలి!