బాలీవుడ్‌ను పురుషాధిక్యత కలిగిన ప్రాంతంగా అభివర్ణిస్తున్నది సీనియర్ నటి దివ్య దత్తా. వినోదరంగంలో లింగ అసమానత రోజురోజుకూ పెరిగిపోతున్నదని ఆమె ఆందోళన వ్యక్తంచేస్తున్నది. తాజాగా, దివ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరిశ్రమ ఇంకా పురుషాధిక్యతలోనే ఉన్నదనీ, నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఇంకా చాలాదూరం వెళ్లాల్సి ఉన్నదని చెప్పుకొచ్చింది. చారిత్రక చిత్రాలలో మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ.. “కథలు, చారిత్రక పాత్రల్లో మహిళల విషయానికి వస్తే.. అవన్నీ కథనంపైనే ఆధారపడి ఉంటాయి.
మీరు రాణి లక్ష్మీబాయి, ఇందిరా గాంధీ గురించి చెప్పాలనుకుంటే.. ఆ సినిమాలకు వాళ్లే కీలకపాత్రలు అవుతారు. అదే, మహారాజ్ శంభాజీ కథ అయితే.. అందరి దృష్టీ అతనిపైనే ఉంటుంది. ఇక్కడ ‘ఎవరి కథ చెబుతున్నాం?’ అనేదానిపైనే అన్నీ ఆధారపడి ఉంటాయి. ఇక పీరియాడికల్ డ్రామాల్లో బలమైన మహిళా పాత్రలు ఉన్నప్పటికీ, వాటిని సమర్థంగా పోషించడానికి ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది” అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నది ఈ సీనియర్ నటి.
తన తాజా ప్రాజెక్ట్ ఛావా గురించి మాట్లాడుతూ.. “రాజమాత సోయరాబాయి పాత్రకోసం నన్ను సంప్రదించినప్పుడు ఎంతో ఎగ్జయిట్ అయ్యాను. ఆ పాత్రకు సంబంధించిన స్కెచ్‌లు, చారిత్రక కథనాలను కూడా అందించారు. దాంతో సులభంగానే ఆ పాత్రలో లీనమయ్యాను. సెట్లు, దుస్తులు, సంభాషణలు.. అన్నీ చాలాబాగా కుదిరాయి. దాంతో.. నిజంగా ఆ కాలంలోకి వెళ్లినట్టు అనిపించింది. ఇలాంటి చారిత్రక చిత్రంలో పనిచేయడం నాకు ఇదే మొదటిసారి.
ఇదో అందమైన అనుభవం కూడా!” అంటూ ‘ఛావా’పై ప్రశంసలు కురిపించింది. 1994లో ‘ఇష్క్‌మే జీనా – ఇష్క్‌మే మర్నా’ చిత్రంతో నటనారంగ ప్రవేశం చేసింది దివ్య దత్తా. తన బహుముఖ ప్రజ్ఞతో.. పరిశ్రమలోని అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా ఎదిగింది. అనేక విజయవంతమైన చిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లలో పనిచేసి.. బాలీవుడ్‌పై చెరగని ముద్ర వేసింది. 30 ఏళ్ల తన కెరీర్లో అనేక ప్రశంసలు, అవార్డులూ అందుకున్నది.