‘ఈ సినిమా చూసినవాళ్లందరూ కేరాఫ్ కంచరపాలెం, పెళ్లిచూపులు చిత్రాలతో పోల్చుతున్నారు. భావోద్వేగభరితమైన కథ ఇది. ఆత్మన్యూనతతో బాధపడేవారికి స్ఫూర్తిగా ఉంటుంది’ అన్నారు వినయ్ రత్నం. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించారు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా మంగళవారం దర్శకుడు వినయ్ రత్నం పాత్రికేయులతో మాట్లాడారు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఎదుటివారిని ప్రేమించగలం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. తనది రాజమండ్రి అని, దాదాపు 25 లఘు చిత్రాల్ని చేశానని తెలిపారు. మెల్లకన్ను ఉన్నవారిని తూర్పు గోదావరి జిల్లాల్లో చిదంబరం అని పిలుస్తుంటారని, ఈ సినిమాలో కూడా హీరోని అందరూ చిదంబరం అంటుంటారని, దీంతో ఆయన సొంతం పేరును కూడా మర్చిపోతారని చెప్పారు.
అభద్రతాభావంతో, ఆత్మన్యూనతతో బాధపడేవాళ్లందరికీ ఈ కథ స్ఫూర్తినిస్తుందని, బలహీనతల్ని ఎలా జయించాలనే అంశాన్ని బోధపరుస్తుందని పేర్కొన్నారు. 32రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన లొకేషన్లలో సినిమా తీశామని, విజువల్స్ చూసిన వాళ్లు అది కేరళ మాదిరిగా ఉందని ప్రశంసిస్తున్నారని దర్శకుడు వినయ్ రత్నం చెప్పారు.