‘ఈ సినిమాలో ఓ డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది. ఓ గ్రామంలో ఉండే గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టాం. ఈ కథలో యాక్షన్, హారర్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల. ఆయన నిర్ధేశకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కథానాయకులుగా నటించిన ‘భైరవం’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు విజయ్ కనకమేడల విలేకరులతో ముచ్చటించారు.
తమిళంలోని ‘గరుడన్’ మూవీకి రీమేక్ ఇదని, తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్ది, తనదైన పంథాలో ప్రజెంట్ చేశానని చెప్పారు. ‘ఈ కథకు ముగ్గురు హీరోలు పర్ఫెక్ట్గా కుదిరారు. వారు ఆఫ్‌స్క్రీన్‌లో సైతం మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల అన్ని విషయాల్లో సపోర్ట్‌గా నిలిచారు. ఇది ముగ్గురు మిత్రుల మధ్య నడిచే ఫ్యామిలీ డ్రామా. కథలోని సంఘర్షణ, భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయి’ అని విజయ్ కనకమేడల తెలిపారు. శ్రీచరణ్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుందని, ఇప్పటికే విడుదలైన పాటలు పెద్ద హిట్ అయ్యాయని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరిందన్నారు. తదుపరి సినిమాల గురించి చెబుతూ ‘చిరంజీవిగారి కోసం ఓ కథని సిద్ధం చేసుకున్నా. అలాగే బాలకృష్ణ, వెంకటేష్‌గారి కోసం కూడా కథలు రెడీ చేశా. ‘భైరవం’ సక్సెస్‌ను బట్టి తదుపరి సినిమాలు ఉంటాయి’ అని విజయ్ తెలిపారు.