బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్య కథాంశంతో రూపొందిన ‘లక్కీ భాస్కర్’ సినిమా గత ఏడాది విడుదలై వందకోట్ల విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘లక్కీభాస్కర్’కి తప్పకుండా సీక్వెల్ ఉంటుందని, ఆ కథలో ఆ అవకాశం ఉందని వెంకీ అట్లూరి పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ లక్కీభాస్కర్’ తర్వాత బయోపిక్స్ చేయాలని పలువురు నిర్మాతలు నన్ను సంప్రదించారు.
కానీ నాకు మాత్రం వాటిని తెరకెక్కించడం ఇష్టంలేదు. థ్రిల్లర్, పీరియాడిక్ చిత్రాలపై నాకు అంత ఆసక్తి ఉండదు. కుంటుంబం అంతా కలిసి హాయిగా కూర్చొని చూసే అందమైన కుటుంబ కథల్ని తెరకెక్కించాలని ఉంటుంది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం సినిమా చేస్తున్నా’ అని తెలిపారు వెంకీ అట్లూరి. ప్రస్తుతం ఆయన సూర్య కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. మమితా బైజూ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు.