గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘సర్కార్-4’ చిత్రాన్ని ఏప్రిల్‌లో మొదలుపెడతానని ఇటీవలే ప్రకటించారు అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఈ గ్యాంగ్‌స్టర్ ట్రయాలజీలో వచ్చిన మొదటి మూడుభాగాలు సంచలన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగో భాగంపై ఆసక్తి ఏర్పడింది. తాజాగా ‘సర్కార్-4’ ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్-2’ ప్రభావంతో తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ఆయన తెలిపారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో ముచ్చటించిన ఆర్జీవీ ‘సర్కార్-4’ గురించి మాట్లాడారు.
“ధురంధర్’ లాంటి సినిమా తర్వాత ‘సర్కార్’ తరహా చిత్రాలు ఏమాత్రం వర్కవుట్ కావనుకుంటున్నా. ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్యధర్ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతున్నానని అందరూ అంటున్నారు. అందులో తప్పేముంది. నేను కాలేజీ రోజుల్లో స్టీవెన్ స్పీల్బర్గ్ను చూసి ఎలా ఫీలయ్యానో.. ఇప్పుడు ఆదిత్యధర్‌ను చూస్తే అలాంటి భావనే కలుగుతున్నది. దర్శకుడిగా నన్ను నేను రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నా. నా తదుపరి సినిమాగా ‘సిండికేట్’ను తీస్తా’ అని వర్మ చెప్పారు.