Krrish-4 | సూపర్ హీరో ఫిలింస్ అంటే ‘బ్యాట్‌మ్యాన్’, ‘సూపర్‌మ్యాన్’, ‘స్పైడర్ మ్యాన్’ అప్పటి వరకు మనం చూసిన సూపర్ హీరోలు వీళ్ళే. అప్పట్లో ఈ సినిమాలు వస్తున్నాయంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్ళం. ఈ సినిమాలు చూసినంత సేపు మనమే సూపర్ హీరోలం.. దేనితో అయినా పోరాడుతాం అంటూ తెగ ఫీలయిపోయే వాళ్ళం. ఇక హాలీవుడ్‌లోనే సూపర్ మ్యాన్లు ఉంటారా? మన దగ్గర సూపర్ మ్యాన్లు ఉండరా? అలాంటి సినిమాలను మన దగ్గర ఎందుకు తెరకెక్కవు అనే ప్రశ్నలు ఎప్పుడు మనసులో మెదులుతూనే ఉండేవి. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానంగా 2003లో రాకేష్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా ‘కోయి మిల్ గయా’ అనే సూపర్ హీరో ఫిలిం వచ్చింది.
అప్పటి వరకు హాలీవుడ్ సూపర్‌హీరో సినిమాలకు అలవాటు పడ్డ మనల్ని ‘కోయి మిల్ గయా’ చిత్రంతో క్రిష్‌గా హృతిక్ రోషన్ అద్భుతం సృష్టించాడు. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను తిరగరాసింది. తరువాత వచ్చిన ‘క్రిష్’, ‘క్రిష్3’ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. గత కొన్నిరోజుల నుంచి ‘క్రిష్4’ చిత్రానికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను జూన్ మొదటి వారంలో ప్రారంభించుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర దర్శకుడు రాకేష్ రోషన్ వీటికి స్పందించి ‘క్రిష్-4 చిత్రానికి సంబంధించిన వార్తల్లో అస్సలు నిజంలేదు.మేము ఎప్పుడైనా ఈ చిత్రం గురించి ఆలోచిస్తే ముందుగా మేమే ప్రకటిస్తాం’ అంటూ చెప్పాడు.
‘క్రిష్’ స్క్రీన్‌ప్లే రైటర్ హని ఇరాని కూడా ఈ వార్తల గురించి స్పందించి’ అస్సలు ఐడియానే లేకుండా ఒక సినిమాను ఎలా ప్రిపేర్ చేస్తాం. క్రిష్ సిరీస్‌పై అస్సలు నాకు ఎలాంటి ఐడియా లేదని’ తేల్చిచెప్పింది. ఇక ‘క్రిష్ పార్ట్4’ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.హృతిక్ రోషన్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్టయిన ‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇందులో హృతిక్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించనున్నాడు. దీనితో పాటుగా ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నాడు.