కథల ఎంపికలో కొత్తదనంతో పాటు వాస్తవికత, సహజత్వానికి పెద్దపీట వేస్తారు తమిళ అగ్ర హీరో ధనుష్. తన సినిమాల ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పాలని ప్రయత్నిస్తారు. త్వరలో ఆయన ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ‘ధనుష్55’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ధనుష్ హిందీలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటిస్తున్నారు. ‘రాన్‌జనా’కు సీక్వెల్ ఇది. ఇది పూర్తయిన వెంటనే రాజ్‌కుమార్ పెరియసామి చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు రాజ్‌కుమార్ ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మన మధ్యే జీవిస్తూ, సమాజ గమనంలో కీలక భూమిక పోషిస్తూ ఏ మాత్రం గుర్తింపుకు నోచుకొని సాధారణ వ్యక్తుల కథ ఇదని చెప్పారు. ‘వీరంతా మన రోజువారి జీవితానికి ఇంధనంలాంటి వారు. సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. కానీ వారున్నారనే విషయాన్ని కూడా మనం గుర్తించం. అలాంటి వ్యక్తుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశా. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో యథార్థ జీవన చిత్రంలా తెరకెక్కించబోతున్నాం’అన్నారు.