న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రభుత్వరంగ బ్యాంకులు అదరగొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 12 పీఎస్బీలు సంయుక్తంగా రూ.52,603 కోట్ల లాభాలను ఆర్జించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.44,473 కోట్ల బ్యాంకుల లాభాలతో పోలిస్తే 18 శాతం వృద్ధి నమోదైందని నివేదిక పేర్కొంది. అలాగే రెండో త్రైమాసికంలో నమోదైన రూ.49,456 కోట్ల లాభంతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది.
వీటిలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వాటా సుమారు 40 శాతంగా ఉండటం విశేషం. ఎస్బీఐ రికార్డు స్థాయి రూ.21 వేల కోట్ల లాభాలను ఆర్జించింది. ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నాలుగు సంస్థలు మాత్రమే సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసుకోగా, మిగతా బ్యాంకులు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. వీటిలో బీవోబీ, యూనియన్ బ్యాంక్, ఇండియా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి.