‘తెలివైన వారికి, తెలివితక్కువ వారికి మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా కథాంశం. తెలివైన వాళ్లు తెలివితక్కువ పని చేసినా, తెలివితక్కువ వాళ్లు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారతాయో ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించాం. ఈ సినిమాలో ఆద్యంతం ఆరోగ్యకరమైన వినోదమే ఉంటుంది. మనిషిలోని అమాయకత్వం నుంచి పుట్టే సహజమైన వినోదాన్ని ఇందులో చూస్తారు.’ అని దర్శకుడు మురళీ మనోహర్ అన్నారు.
ఆయన దర్శకత్వంలో నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన వినోదాత్మక చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా డైరెక్టర్ మురళీ మనోహర్ గురువారం విలేకరులతో మాట్లాడారు.
‘గుర్రం పాపిరెడ్డి’ పాత్రలో నరేశ్ అగస్త్య సహజంగా నటించారని, జాతిరత్నాలు, మత్తువదలరా 2 చిత్రాల్లో అద్భుతంగా నటించిన ఫరియా అబ్దుల్లా ఇందులోనూ తనదైన శైలిలో అద్భుతంగా నటించిందని, అలాగే ఓ పాట తనే స్వయంగా రాసి, కొరియోగ్రఫీ కూడా చేసిందని మురళీ మనోహర్ తెలిపారు. ‘బ్రహ్మానందం ఇందులో కీరోల్ పోషించారు. ఆయనతోనే సినిమా మొదలువుతుంది. ఆయనతోనే పూర్తవుతుంది. సాంకేతికంగా అన్ని విభాగాలూ సమర్ధవంతంగా పనిచేశాయి’ అని మురళీ మనోహర్ పేర్కొన్నారు.