పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను మేకర్స్ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు మారుతి రీసెంట్గా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ‘రాజాసాబ్ రిలీజ్‌కు ముందు రాజాసాబ్ ప్రపంచంలోకి మీ అందర్నీ తీసుకెళ్లబోతున్నాం. రాజాసాబ్ ప్రయాణాన్ని ఇందులో ఆవిష్కరించనున్నాం.
అసలు ఈ ప్రపంచ సృష్టి ఎలా జరిగింది?.. దీని వెనుక ఉన్న కష్టం ఏంటి?.. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనుల్లో ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఈ వీడియో ఉంటుంది. ఈ ట్రీట్‌ని త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ‘ది రాజాసాబ్ ట్రీట్ ఆన్ ది వే..’ అని మారుతి చెప్పుకొచ్చారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: ఎస్.తమన్, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.