వెండితెరపై మరో తెలంగాణ తేజం మెరిసింది. సాహిత్యం, సినిమా ప్రాణంగా పెరిగిన ఎలిగేడు యువకుడు ఒక్క చాన్స్‌తో వెలిగిపోయాడు. షార్ట్ ఫిల్మ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘పేపర్ బాయ్’లా కష్టపడ్డాడు. ‘అరి’ సినిమాలో చూపినట్టే అరిషడ్వర్గాలను గెలిచి మార్గదర్శి అయ్యాడు జయశంకర్ వంగా. అవమానాలు, అవరోధాలను దాటుకుని.. తన సినిమా ప్రస్థానం ఇలా సాగిందని చెబుతున్నాడు.
మాచిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యం చాలా ఇష్టం. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ బాగా చదివేవాడిని. మా ఎలిగేడు (కరీంనగర్)లోని జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులు సుదర్శనాచార్యులు సాహిత్యం పట్ల ఆసక్తి, ప్రేమ కలిగేలా బోధించారు. నాలోని సాహిత్యాభిలాషను ప్రోత్సహించారు. ఏడో తరగతి చదివే రోజుల్లోనే రచయిత గానీ, సినిమా దర్శకుడు గానీ కావాలని నిర్ణయించుకున్నా. స్కూల్ డేస్‌లోనే షార్ట్ స్టోరీస్ రాశాను. స్థానిక పత్రికలో నా కథలు అచ్చయ్యాయి.
ఇంటర్ తర్వాత కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో చేరాను. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు నవలలు ఎక్కువగా చదివాను. రచయితలు కొమ్మనాపల్లి గణపతిరావు, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, సింహప్రసాద్, మధుబాబుని కలిశాను. రాసేప్పుడు క్యారెక్టర్ని ఎలా క్రియేట్ చేస్తారని వాళ్లను అడిగాను. కొమ్మనాపల్లి గణపతిరావు గారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేయాలనుకున్నాను. అదే అడిగితే… ‘ఇప్పుడు వద్దు. ఇంజినీరింగ్ తర్వాత రా’ అన్నారు. బీటెక్ పూర్తవగానే బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎస్బీఐలలో క్లర్క్‌గా మూడున్నరేళ్లు పని చేశాను. ఆ ఉద్యోగాల్లో సంతృప్తి దొరకలేదు. నాకు కళలంటే ఇష్టం. సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాను. కానీ, మా వాళ్లు మొదట ఒప్పుకోలేదు. మా నాన్న (వంగా కనకయ్య) టింబర్ డిపో నడిపేది. ఈ సినిమా మనతోని కాదని తిట్టాడు. బంధువులు ఎగతాళి చేశారు. అందరికీ మా అన్నయ్య సర్దిచెప్పి, ఇంటి బాధ్యతలు తీసుకుని నాకు సినిమాల్లోకి వెళ్లే దారి చూపాడు. నా పట్టుదల చూసి కొంత గడువు పెట్టారు. అప్పటిలోగా నిరూపించుకోమని ఓ అవకాశం ఇచ్చారు.

రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారు సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. అపరంజి, అభిషేకం, అరుంధతి సీరియల్స్‌కి అసిస్టెంట్ రైటర్‌గా పనిచేశాను. సీరియల్స్ కోసం పని చేస్తున్నప్పుడే సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేశాను. రెండేళ్లపాటు అలా సేవలు అందించాను. నా టార్గెట్ సినిమా డైరెక్టర్. దానికి దారులు వేసుకునే ఆలోచనతో ఘోస్ట్ రైటర్ పనులు పక్కనపెట్టి, షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాను. షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వొచ్చని అనుకున్నాను. నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్‌కి మిలియన్ వ్యూస్ వచ్చాయి. మంచి క్వాలిటీతో అయిదు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. అనుకున్నట్టే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. సినిమా ఆఫర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోసాగాయి. నిరాశలో కూరుకుపోయాను. నాకే ఎందుకిలా జరుగుతున్నదని బాధపడటం తప్ప కారణం తెలుసుకోలేకపోయాను.
పట్టువదలకుండా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ పోయాను. ఓ రోజు.. డైరెక్టర్ సంపత్ నంది టీమ్ నుంచి కాల్ వచ్చింది. సంపత్ గారి దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది. దాన్ని డెవలప్ చేయడానికి నన్ను రైటర్‌గా పెట్టుకున్నారు. స్టోరీని డెవలప్ చేశాను. ‘సీన్లన్నీ నువ్వే రాశావు కదా. నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది’ అని సంపత్ గారు అవకాశం ఇచ్చారు. అలా నా మొదటి సినిమా ‘పేపర్ బాయ్’ షూట్ సంతోషంగా మొదలైంది. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అల్లు అరవింద్ గారు తీసుకున్నారు. ఆ పరిచయంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఓ సినిమా తీద్దామన్నారు. ఆ ప్రాజెక్ట్ కరోనా వల్ల ప్రారంభంలోనే ఆగిపోయింది. అయినా నేను ఆగిపోలేదు. కథలు రాసుకుంటూ, వాటిని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను.
కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నాయి. కొత్త నిర్మాతలు పరిచయమయ్యారు. మనిషికి శత్రువు ఎదురుగానో, ఎక్కడో ఉండడు. మనసులోనే ఉంటాడు. అరిషడ్వర్గాలనే ఆ అంతర్గత శత్రువులను జయిస్తే అన్నీ జయించినట్లే. ఈ అరిషడ్వర్గాలే కథాంశంగా ‘అరి’ సినిమా మొదలుపెట్టాం. కొంత బడ్జెట్ అనుకున్నాం. ప్రొడక్షన్ మొదలుపెట్టాక బడ్జెట్ అంచనాలు దాటింది. ఒకడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వేయాల్సి వచ్చింది. అందువల్ల నాలుగేళ్లు షూటింగ్ చేయాల్సి వచ్చింది.
పేపర్ బాయ్ సినిమా ఎంత స్పీడ్‌గా జరిగిందో రెండో సినిమా అంత ఆలస్యంగా నడిచింది. నాలుగేళ్లకు ‘అరి’ సినిమా పూర్తయింది. ఆలస్యమైనా, బడ్జెట్ పెరిగినా మా కష్టానికి ఫలితం దక్కింది. ‘అరి’ సినిమా నిర్మాతలకు డబ్బు, నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నన్ను నిలబెట్టిందని చెప్పొచ్చు. నా సినిమాల్లో కృష్ణతత్వం ఉంటుంది. సినిమా స్టోరీని సింబాలిక్‌గా చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. ఎమోషన్స్‌ని బలంగా చూపిస్తాను. మంచి సినిమాలు తీయాలన్నదే నా భవిష్యత్ లక్ష్యం.
– నాగవర్ధన్ రాయల