ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నిర్వహిస్తున్న ‘మా పల్లె చారిటబుల్ ట్రస్ట్’ పాత్రికేయ సమావేశం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, ఆయన సోదరులు నరసింహారెడ్డి, శిరీష్, దర్శకులు వేణు శ్రీరామ్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పల్లిలో ఇందూరు రైతుల సహకారంతో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడ పండిన ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి నైవేద్యం తయారీకి పంపిస్తున్నాం.
రైతుల బాగు కోసం నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ నుంచి ప్రజలు విరాళాల రూపంలో ధాన్యం కొని తిరుమలకు పంపవచ్చు. 10 కిలోల నుంచి ఎంతైనా ధాన్యం కొని దేవుడి నైవేద్యానికి విరాళం ఇవ్వవచ్చు. రైతులు అత్యంత నిష్టగా ఇక్కడ వ్యవసాయ పనులు చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ…‘దేవుడి గుడిలోకి ఎంత పవిత్రంగా మనం అడుగుపెడతామో, అంతే పవిత్రంగా మా రైతులు పొలంలోకి వెళ్తారు. అందుకే దీన్ని ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం అని పిలుస్తున్నాం. మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడి పంటను శ్రీ వేంకటేశ్వరుడి నైవేద్యం కోసం పంపడం ధన్యంగా భావిస్తున్నాం’ అన్నారు.