Dil Raju | ‘బెనిఫిట్ షోస్కీ, టికెట్ రేట్ల పెంపుకీ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సహకరిస్తే బావుంటుంది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేస్తా. తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే.’ అని ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. తెలంగాణలో ఇక టికెట్ రేట్ల పెంపు, బెనిఫెట్షోలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా దిల్‌రాజు పై విధంగా స్పందించారు. ఆయన నిర్మించిన గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి.
ఈ సందర్భంగా సోమవారం దిల్‌రాజు విలేకరులతో ముచ్చటించారు. ‘నిర్మాణంలో సంతృప్తినిచ్చిన సినిమాలు కూడా పరిస్థితుల కారణంగా నష్టాలు తెచ్చిపెట్టాయి. బాగా ఆడాల్సిన వకీల్‌సాబ్‌కు కూడా కోవిడ్ వల్ల థియేటర్లు లేకుండా పోయాయ్. వారిసు, ఫ్యామిలీస్టార్ సినిమాలు డిజప్పాయింట్ చేశాయి. వీటిమధ్య ఊరటనిచ్చిన సినిమా ‘బలగం’ మాత్రమే. కెరీర్ పరంగా బ్రేక్ తీసుకోవాలని ఓ నెల రోజులు అమెరికా వెళ్లిపోయాను. . ఏదేమైనా సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే విలువ. అందుకే.. ఇక కథలపైనే శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నా.’ అని చెప్పారు దిల్‌రాజు. ఇంకా మాట్లాడుతూ ‘ ‘గేమ్‌ఛేంజర్’లో మాస్ విజిల్స్ కొట్టే మూమెంట్స్ చాలా ఉంటాయి. శంకర్ సినిమాలో సందేశం, నా సినిమాల్లో విలువలు ఉంటాయని చిరంజీవిగారు ఓ సందర్భంలో అన్నారు.
ఈ రెండూ ‘గేమ్‌ఛేంజర్’లో ఉంటాయి. నాలుగున్నరేళ్ల ఎమోషన్స్‌కు నాలుగురోజుల్లో ఫలితం రానుంది. ఇక ‘సంక్రాతికి వస్తున్నాం’ సినిమాను ఆల్రెడీ అందరూ సూపర్‌హిట్ అంటున్నారు. ఈ బజ్‌కి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి. కచ్చితంగా రానున్న గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు నా కమ్ బ్యాక్ ఫిల్మ్స్. నో డౌట్’ అని నమ్మకం వెలిబుచ్చారు దిల్‌రాజు. ‘గేమ్‌ఛేంజర్’ రాజమండ్రి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చి, తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదం వల్ల ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు నిర్మాత దిల్‌రాజు చెరో అయిదు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.