‘కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సినీ పరిశ్రమలోకి రావాలనుంటుంది. అయితే వారికి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటివారికోసం ఏం చేస్తే బావుంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టిందే ‘దిల్‌రాజు డ్రీమ్స్’. పరిశ్రమకు పరిచయం కావాలనుకునేవారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ఈ ‘దిల్‌రాజు డ్రీమ్స్’ అనే వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశాం.’ అని దిల్‌రాజు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ‘దిల్‌రాజు డ్రీమ్స్’ వెబ్సైట్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. హీరో దేవరకొండ విజయ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ వేడుకకు అతిథులుగా హాజరై ఈ వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.
ఇంకా దిల్‌రాజు మాట్లాడుతూ ‘22ఏండ్ల క్రితం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థను స్థాపించి, ప్రథమంగా ‘దిల్’ సినిమా తీశాం. ఆ తర్వాత ఎంతోమంది కొత్త దర్శకుల్ని ఇదే బ్యానర్ ద్వారా లాంచ్ చేశాం. వాళ్లంతా ఈ రోజున సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే కొత్తవారి కోసం కొత్త టీమ్‌ని ఏర్పాటు చేస్తే, ఔత్సాహికులకు సరైన వేదిక దొరికినట్టవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘దిల్‌రాజు డ్రీమ్స్’ సంస్థను ఓ యంగ్ జనరేషన్ టీంతో ఫామ్ చేశాం. ఉత్సాహవంతులు అప్లికేషన్ పెట్టుకోండి.
స్క్రూటినీ చేసి, మెజారిటీ పీపుల్ లైక్ చేసిన ప్రొడక్ట్ మా దగ్గరకు వస్తుంది. ప్రతిభావంతులకు కచ్ఛితంగా అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే పదివేల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది. నిర్మాతలు కావాలనుకునేవారికి కూడా ఈ సంస్థ గైడెన్స్ ఇస్తుంది.’ అని తెలిపారు. ఇంకా దేవరకొండ విజయ్, దేవిశ్రీప్రసాద్, నిర్మాత శిరీష్ కూడా మాట్లాడారు.