అగ్ర కథానాయిక సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లకు విరామమిచ్చి ఇంటిదగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నది. ఇదిలావుండగా సమంత అనారోగ్యం గురించి గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని.. ఆ కారణంతోనే ముందుగా ఒప్పుకున్న బాలీవుడ్ సినిమాల నుంచి తప్పుకుందనే గాసిప్స్ వచ్చాయి.
సమంత తెలుగులో విజయ్‌దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషి’ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కూడా మరింత ఆలస్యం కానుందనే పుకార్లు వ్యాపించాయి. తాజాగా వీటిపై సమంత పర్సనల్ టీమ్ స్పందించింది. సోషల్‌మీడియాలో వ్యాప్తి అవుతున్న వదంతుల్ని నమ్మొద్దని కోరింది. సమంత బాలీవుడ్‌లోని ఏ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదని, సంక్రాంతి అనంతరం ‘ఖుషి’ సినిమా షూటింగ్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది.