Game Changer Review | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబినేషన్ అనగానే ఓ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ట్రిపులార్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం, ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు అందించిన శంకర్ (Shankar) నేరుగా తెలుగులో తీసిన తొలి సినిమా కావడం, దిల్ రాజు లాంటి నిర్మాత చేతులు కలపడం, సంక్రాంతి బరిలో అందరికంటే ముందుగా అడుగుపెట్టడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, అంచనాలున్న సినిమాగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరా అంచనాలని గేమ్ ఛేంజర్ అందుకుందా? చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిందా? రివ్యూలో చూద్దాం.
కథ గురించి:
రామ్నందన్ (రామ్చరణ్) విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటాడు. ఇదే సమయంలో అభ్యుదయ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుంది. సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య) ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేస్తాడు. తండ్రిని అడ్డుతొలగించి పదవి కోసం ఓ పన్నాగం పన్నుతాడు. సరిగ్గా ఇదే సమయంలో రామ్నందన్కు సంబంధించిన ఓ రహస్యం బయటపడుతుంది. ఏమిటా రహస్యం..? రామ్నందన్కు సత్యమూర్తికి వున్న అనుబంధం ఏమిటి..? ఈ కథలో అప్పన్న (రామ్చరణ్) ఎవరు? ముఖ్యమంత్రి కుర్చీ కోసం మోపిదేవి చేసిన కుట్రలని రామ్నందన్ ఎలా తిప్పికొట్టాడు? ఇవన్నీ తెరపై చూడాలి.
కథా విశ్లేషణ :
ఓ ఐఏఎస్ అధికారికీ, రాజకీయ నాయకుడికీ మధ్య సాగే పోరాటమే గేమ్ ఛేంజర్. గతంలో వ్యవస్థలని ప్రక్షాళన చేసే లార్జర్ దెన్ లైఫ్ కథలని తీసి ప్రేక్షకులు మన్ననలు అందుకున్న శంకర్ గేమ్ ఛేంజర్ కూడా తనదైన శైలిలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ బ్యూరోక్రసీ పవర్ ఏమిటో చూపించాలనే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నం కాసేపు కాలక్షేపాన్ని అందించినప్పటికీ చాలా వరకూ శంకర్ పాత సినిమాలని గుర్తు చేస్తూ సాగుతుంది.
ముఖ్యమంత్రి సత్యమూర్తి పాత్ర కోణంలో కథ మొదలౌతుంది. ఆ పాత్ర చుట్టూ ఎదో బలమైన ఫ్లాష్ బ్యాక్ వుందని ఆరంభ సన్నివేశాల్లో అర్ధమౌతుంది. నిజానికి ఆ ఫ్లాష్ బ్యాక్ బావుంది. చరణ్ అప్పన్న పాత్రలో కనిపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన నటన, ఎమోషన్ చాలా వరకూ పండింది. ఇక ప్రధమార్ధంలో చరణ్ ఎంట్రీ ఫైట్ ఫ్యాన్స్ కోసం అన్నట్టుగా వుంటుంది. ఐఎఎస్ అధికారికగా తన విధులుని నిర్వర్తించే మొదటి రెండు ఎపిసోడ్స్ లో శ్రుతి మించిన నాటకీయత కనిపిస్తుంది.
ఇంటర్వెల్ ట్విస్ట్ ముందుగానే ఊహించేదే అయినప్పటికీ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచింది. సెకండ్ హాఫ్ లో అప్పన్న ఎపిసోడ్ పాసైనట్లుగా.. ఎలక్షన్ ఎపిసోడ్ కుదరలేదు. ఎమోషనల్ గా ఆ ఎపిసోడ్ ఎంతమాత్రం కనెక్టింగ్ గా వుండదు. వ్యవస్థపై సరైన కసరత్తు చేయకుండా ఎదో కమర్షియల్ గా చూట్టేసిన ఫీలింగ్ కలుగుతుందే తప్పితే ఆ సన్నివేశాల్లో ప్రేక్షకుడు లీనం కాలేడు.
నటీనటులు నటన :
అప్పన్న పాత్రలో చరణ్ అదరగొట్టాడు. ఆ పాత్రలో చరణ్ ఎమోషన్స్ బాగా పండాయి. నటనలో చాలా పరిణితి కనబరిచాడు. నత్తి నటించే సందర్భాల్లో చాలా సహజంగా కనిపించాడు. రామ్నందన్ లుక్, క్యారెక్టరైజేషన్ డీసెంట్ గా వుంది. తన ఫిజిక్ ని పర్ఫెక్ట్ గా మెంటైన్ చేశాడు. చరణ్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఎస్జే సూర్యది. తన యాక్టింగ్ డైలాగ్ డిక్షన్ సీరియస్ గా ఉంటూనే అక్కడక్కగా నవ్విస్తుంటుంది.
కియార అద్వానీ పాత్ర కథకి ఫిట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో ఓ పాటలో తప్పితే పెద్దగా కనిపించదు. అంజలికి మంచి పాత్ర పడింది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ ది కీలకమైన పాత్రే. ఆయన లుక్ కొత్తగా వుంది. జయరాం పాత్రని కామెడీ చేసేశారు. సముద్రఖని, రాజీవ్ కనకాల కథ మేరకు కనిపించారు. సునీల్ క్యారెక్టరైజేషన్ వర్క్ అవుట్ కాలేదు.
టెక్నికల్ గా:
తిరు విజువల్స్ లావిష్ గా వున్నాయి. ప్రతి సన్నివేశంలో రిచ్ నెస్ కనిపిస్తుంది. తమన్ నేపధ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలపై మంచి ప్రభావం చూపింది. జరగండి, రా మచ్చా పాటలు విజువల్ గా గ్రాండ్ గా వున్నాయి. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు కొన్ని మెరిశాయి. ‘రాజకీయం స్నేహితుడిని ద్రోహిగా చేసింది. అభిమానిని హంతకుడిగా మార్చింది’ అనే మాట బలంగా పడింది. విజువల్స్ లో శంకర్ చాలా చోట్ల తన మార్కు చూపించాడు. నిర్మాణం పరంగా దిల్రాజు ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్..
రామ్ చరణ్ నటన
ఫ్లాష్ బ్యాక్, విజువల్ గ్రాండియర్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్..
కథలో కొత్తదనం లేకపోవడం
కొరవడిన భావోద్వేగాలు
రేటింగ్: 2.75 /5
Bachchala Malli | అల్లరి నరేశ్ బచ్చలమల్లిని థియేటర్లలో మిస్సయ్యారా..? ఈ వార్త మీ కోసమే..
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్