Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన రూమర్స్‌కు తెరపడింది. “ధర్మేంద్ర గారు మరణించారు”, “వెంటిలేటర్‌పై ఉన్నారు” అనే తప్పుడు వార్తలు వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా ఆయన కుమారుడు, స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) స్వయంగా ముందుకొచ్చి ఈ ప్రచారాలను ఖండించారు.సన్నీ డియోల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో,“నా తండ్రి ధర్మేంద్ర గారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ (Breach Candy Hospital) కు వెళ్లారు.
స్వల్ప శ్వాస సమస్య కారణంగా డాక్టర్లను సంప్రదించారు. దయచేసి ఎవరూ తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు, మా కుటుంబ గోప్యతను గౌరవించండి” అని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ధర్మేంద్ర అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన టీమ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, ధర్మేంద్ర గారు పూర్తిగా సేఫ్‌గా ఉన్నారు. వెంటిలేటర్‌పై లేరు. కేవలం సాధారణ అబ్జర్వేషన్లో ఉన్నారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వివరించింది. ధర్మేంద్ర గత అక్టోబర్ 31న కూడా స్వల్ప శ్వాస సమస్యతో ఆసుపత్రికి వెళ్లారు. తరువాత ఆరోగ్యం మెరుగై ఇంటికి తిరిగి వచ్చారు. ఈసారి కూడా సాధారణ చెకప్ కోసం వెళ్లిన విషయాన్ని కొంతమంది సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేయడంతో తప్పుడు వార్తలు వ్యాపించాయి.
1958లో “దిల్ భీ తేరా హమ్ భీ తేరే” చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ధర్మేంద్ర, తరువాత “షోలే”, “ధర్మ్ వీర్”, “చుప్కే చుప్కే”, “సీటా ఔర్ గీత”, “యాదోంకీ బారాత్” వంటి క్లాసిక్ సినిమాలతో బాలీవుడ్లో లెజెండ్‌గా నిలిచారు. ఆయన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, స్టైలిష్ యాక్షన్, మాస్ అపీల్ కారణంగా అభిమానులు ఆయనను ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’ అని పిలుస్తారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం ‘ఇక్కీస్ (Ikkis)’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. మరోవైపు డిసెంబర్ 8న తన 90వ పుట్టినరోజు జరుపుకోబోతున్న ధర్మేంద్ర కి అభిమానులు, సినీ ప్రముఖులు “గెట్ వెల్ సూన్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.