Dharmendra | ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ధర్మేంద్రకు చికిత్స అందిస్తున్న వైద్యుడు డాక్టర్ ప్రతీత్ సమదానీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ .. “ధర్మేంద్ర ఉదయం 7.30 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబం నిర్ణయం మేరకు ఆయనకు ఇంటి వద్దే చికిత్స కొనసాగించనున్నాం” అని పీటీఐకి తెలిపారు.
ఇక ధర్మేంద్ర కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతనిచ్చారు. “ధర్మేంద్ర గారు క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మీడియా , ప్రజలు ఎటువంటి ఊహాగానాలు లేదా తప్పుడు ప్రచారం చేయకూడదు. మా కుటుంబ ప్రైవసీని గౌరవించాలని మనవి చేస్తున్నాం” అని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.ధర్మేంద్ర మరణించారనే తప్పుడు ప్రచారంపై కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆయన భార్య, ప్రముఖ నటి హేమ మాలిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ – “ఇలా తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం క్షమించరానిది. ఇంకా చికిత్స పొందుతూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యతారహితంగా వార్తలు ప్రసారం చేయడం చాలా దారుణం” అని పేర్కొన్నారు. ఆమె మీడియాను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కుటుంబ గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ కూడా స్పందిస్తూ..“నా తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కోలుకుంటున్నారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలన్న ప్రార్థనలు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు. కాగా, ధర్మేంద్ర సోమవారం రోజు బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో ఆయనకు స్వల్ప శ్వాస సమస్య తలెత్తినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని కుటుంబ వర్గాలు వెల్లడించాయి.