వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రధారులు. స్టూడియో 99 సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్.ఆర్ దర్శకుడు. రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. ఇటీవలే ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సినిమాను తిలకించి, ఈ సినిమా టైటిల్‌ని, ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
మంటల్లో చిక్కుకున్న బస్‌ను, ఆ బస్‌లో ప్రాణాలకై కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో చూడొచ్చు. అలాగే గోనె సంచులలో బంధించబడ్డ వ్యక్తులు కూడా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ‘మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?’ అన్న కోట్ పోస్టర్లో ఆలోచింపజేస్తున్నది. సామాజిక వ్యాఖ్యానం, పశ్చాత్తాపం, విముక్తి నేపథ్యంలో సాగే హార్ట్ టచ్చింగ్ ప్రేమకథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి. సంగీతం: మార్క్ కె.రాబిన్.