Deepika Padukone | షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన పఠాన్ సినిమా రేపు విడుదల కానున్నది. ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని భజరంగ్దళ్తోపాలు పలు హిందూ మతవాద సంస్థలు హెచ్చరికలు జారీచేశాయి. సెన్సార్ బోర్డు కూడా పలు కోతలకు సిఫారసు చేసింది. సినిమా విడుదలకు ముందు దీపికా పదుకోన్ తొలిసారిగా ఈ చిత్రంలోని వివాదాస్పద పాట బేషరమ్ రంగ్ పై పెదవి విప్పింది.
‘పఠాన్ సినిమాలోని రెండు పాటలు నాకు చాలా ఇష్టమైనవి. వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే నాకు చాలా కష్టం. ఈ రెండూ చాలా భిన్నంగా ఉంటాయి. బేషరమ్ రంగ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నా సోలో సాంగ్. బేషరమ్ రంగ్ షూటింగ్ లొకేషన్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ పాట ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. పాట షూటింగ్ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉండటంతో క్లిష్ట పరిస్థితుల్లో పని చేశాం. అలాంటి పరిస్థితుల్లో అందంగా, ఎండ ఉన్నట్లుగా చూపించడం ఏమంత సులభం కాదు’ అని దీపికా పదుకోన్ చెప్పారు. షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించడం ఎంతో ఉద్విగ్నంగా ఉన్నదని దీపిక తెలిపారు. ఈ సినిమాలోని రెండు పాటలను చాలా ఆస్వాదించానని పేర్కొన్నారు. ఈ రెండూ పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉన్నదన్నారు.
బేషరమ్ రంగ్ పాటలో నటించడం ఒక్క దీపికా పదుకోన్తోనే సాధ్యమని ఇటీవల ఈ సినిమా హీరో షారుఖ్ ఖాన్ చెప్పారు. కాగా, బేషరమ్ రంగ్ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించారు. దీనికి వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ ఇచ్చారు. జాన్ అబ్రహం విలన్‌పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇంకా డింపుల్ కపాడియా, అశుతోష్ రానా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.