అగ్ర కథానాయిక రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. సాంకేతికతను దుర్వినియోగపరుస్తూ వికృత చేష్టలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై కీర్తి సురేష్ స్పందించింది. నేటి రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం వరమో శాపమో అర్థం కావట్లేదని, సోషల్‌మీడియాను మంచి పనుల కోసం ఉపయోగిస్తే సమాజం బాగుంటుందని హితవు పలికింది.
ఆమె మాట్లాడుతూ ‘నిజంగా ఇలాంటి ఫేక్ వీడియోలు చూస్తే భయమేస్తుంది. టెక్నాలజీ సహాయంతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టే బదులు..ఆ సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలి. సమాజంలో ఆశావహ దృక్పథాన్ని, ప్రేమను పెంపొందించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించాలి. అంతేకాని ఇలాంటి చెత్తను షేర్ చేస్తూ రాక్షసానందం పొందడం కోసం కాదు’ అని కీర్తి సురేష్ ట్వీట్ చేసింది.