‘దంగల్’ బాలనటి సుహానీ భట్నాగర్(19) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కాలికి గాయమవ్వడంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు సుహానీ. ఈ క్రమంలో ఆమె వాడుతున్న మందులు వికటించడంతో ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించి తుదిశ్వాస విడిచినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. అసలు కారణం తెలియడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ‘దంగల్’లో చిన్నప్పటి బబితగా నటించారు సుహానీ. ఆ సినిమా ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది.
‘దంగల్’ తర్వాత పలు వ్యాపారప్రకటనల్లో కూడా నటించారు సుహానీ. అయితే.. 2019 నుంచి పూర్తిగా ఆమె చదువుకే పరిమితమయ్యారు. 2021 నవంబర్‌లో చివరిసారిగా సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది సుహానీ. ఆ తర్వాత సోషల్‌మీడియాకు కూడా దూరంగా ఉంది. సుహానీ మరణాన్ని ధృవీకరిస్తూ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ విచారం వ్యక్తం చేసింది. ‘సుహానీ మరణవార్త మా హృదయాలను తీవ్రంగా కలచివేస్తున్నది. ఆమె తల్లికీ, కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. సుహానీ మంచి నటి. ఆమె లేని ‘దంగల్’ అసంపూర్ణం. మా గుండెల్లో ఎప్పటికీ ఆమె ధృవతారగా నిలిచే ఉంటుంది. సుహానీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఇన్‌స్టాలో అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ పోస్ట్ చేసింది.