డబ్బా కార్టెల్
నెట్‌ఫ్లిక్స్ : ఫిబ్రవరి 28, 2025
తారాగణం : షబానా అజ్మీ, జ్యోతిక, శాలినీ పాండే, నిమిషా
సజయన్, అంజలి ఆనంద్, జిషుసేన్ గుప్త తదితరులు
దర్శకత్వం : హితేశ్ భాటియా
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే కథలది మినిమం గ్యారెంటీ! అందులోనూ డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉందంటే.. హిట్ అవ్వాల్సిందే! అలాంటి కథతోనే వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్.. డబ్బా కార్టెల్. నెటిఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి వచ్చి.. హిట్ టాక్ తెచ్చుకున్నది. ఉత్తరాది – దక్షిణాదికి చెందిన పలువురు లేడి స్టార్స్ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కథ ముంబై నేపథ్యంలో సాగుతుంది. ఓ ఫార్మా కంపెనీ తయారుచేసిన డ్రగ్స్ వల్ల కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ డ్రగ్స్‌కు అనుమతి లేకపోవడంతో అసలు విషయాన్ని బయటపెట్టేందుకు ఫుడ్ అండ్ డ్రగ్స్ అధికారి పాఠక్(గజరాజ్ రావు) ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. మరోవైపు రాజి (శాలినీ పాండే) భర్త ఫార్మా కంపెనీలో ఉద్యోగి. తనకు జర్మనీ వెళ్లి.. అక్కడే స్థిరపడాలని కోరిక. అందుకు సరిపడా డబ్బు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు.
ఇటు భర్తకు సాయపడాలని ‘లంచ్ బాక్స్’ పేరిట వ్యాపారం చేస్తుంటుంది రాజి. మాల (నిమిషా సజయన్) రాజికి అసిస్టెంట్. పెద్దగా చదువుకోని మాలకు.. కనీసం తన బిడ్డనైనా ఉన్నతంగా చదివించాలనీ, సమాజంలో గౌరవం పొందాలని ఆశగా ఉంటుంది. అయితే, మాలా బాయ్ ఫ్రెండ్ సంతోష్.. ప్రైవేట్ వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. లంచ్ బాక్సుల్లో ఆహారంతోపాటు గంజాయి సప్లయ్ చేయాలని ఆమెను బెదిరిస్తాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో మాల అందుకు ఒప్పుకొంటుంది. అయితే, గంజాయితోనే ఆగకుండా.. డ్రగ్స్ కూడా ఎందుకు సప్లయ్ చేయాల్సి వచ్చింది? ఇందులోకి దిగిన మాలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ కథలో షీలా (షబానా అజ్మీ), వరుణ (జ్యోతిక) పాత్రలేంటి? తెలుసుకోవాలంటే.. వెబ్ సిరీస్ చూడాల్సిందే! మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్.. చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా సాగిపోతుంది.