ఏ సమయంలో ఎందరు ఇంటికి వచ్చినా కాదనకుండా, లేదనకుండా స్వయంగా తనే వండి, వార్చి అన్నార్తుల ఆకలి తీర్చిన అపర అన్నపూర్ణ ‘డొక్కా సీతమ్మ’. ఈమె కథ వెండితెరకెక్కించే ప్రయత్నంలో వివాదం నెలకొన్నది. ఈ విషయం గురించి హైదరాబాద్‌లో దర్శక, రచయిత రామకృష్ణ, వి.ప్రభాకర్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఎంతోకాలంగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, చరిత్రను పరిశోధించి ఈ స్క్రిప్ట్ తయారు చేశాం. హైదరాబాద్, సినీరచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయించాం.
అయితే.. ఇది చరిత్ర అనే సాకుతో, మా స్క్రిప్ట్‌నే కాపీ కొడుతూ వేరొకరు ఈ సినిమా తీయడానికి పూనుకోవడంతో వివాదం కోర్టుకు చేరింది. కాపీరైట్ యాక్ట్ మాకు ఉన్నప్పటికీ.. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున, మేం నిర్మాణం జోలికి వెళ్లకుండా సైలెంట్‌గా ఉన్నాం. అయితే.. అవతల వాళ్లు మాత్రం సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. నిజంగా అలాంటిదే జరిగితే.. అది కోర్టు ధిక్కారం అవుతుంది. కోర్టులో విషయం తేలే వరకూ యధాతథస్థిని కొనసాగించాలి. లేదంటే కోర్టు ద్వారానే సమాధానం చెబుతాం.’ అని హెచ్చరించారు.