వెండితెరపై కొన్ని జంటలకు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసిన మరలా చూడాలనే ఉత్సుకతను రేకెత్తిస్తారు. ఓ నాయకానాయిక ద్వయం కలిస్తే సినిమా సూపర్‌హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఈ జోడీల పట్ల కుతూహలానికి కారణంగా చెప్పొచ్చు. కొన్ని కాంబినేషన్స్‌కు వ్యాపారపరమైన క్రేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమీకరణాలన్నీ బేరీజు వేసుకొని దర్శకనిర్మాతలు కాంబినేషన్ వన్స్‌మోర్ అంటుంటారు. ప్రస్తుతం తెలుగు తెరపై కూడా కొందరు హీరోహీరోయిన్ల జోడీలు పునరావృతమవుతూ ప్రేక్షకుల్ని కనులవిందు చేస్తున్నాయి. ఈ జంటల ముచ్చట్లేందో ఓసారి చూద్దాం..
‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవితో తొలిసారి తెరపంచుకొని అలరించింది పంజాబీ సోయగం కాజల్ అగర్వాల్. ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్హిట్కావడంతో చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో కాజల్‌నే నాయికగా ఎంచుకున్నారు. చిరంజీవి వంటి లెజెండ్‌తో మరోసారి కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కాజల్ అగర్వాల్ చాలా సందర్భాల్లో చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దేవుడి మాన్యాల అన్యాక్రాంతం అంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తన అందచందాలతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.
బాలీవుడ్ యవనికపై చక్కటి స్టార్డమ్తో దూసుకుపోతోంది ఢిల్లీ సుందరి కియారా అద్వాణీ. ‘ధోనీ’ ‘కబీర్‌సింగ్’ వంటి సినిమాలు హిందీ చిత్రసీమలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాల ద్వారా యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ వయ్యారి రామ్‌చరణ్‌తో వన్స్‌మోర్ అంటోంది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా అగ్ర నిర్మాత దిల్‌రాజు ఓ పాన్ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కియారా అద్వాణీ నాయికగా ఖరారైంది. ఈ మధ్యే దర్శకుడు శంకర్ ఈ ముద్దుగుమ్మతో భేటీ అయ్యారు. శంకర్ వంటి అగ్ర దర్శకుడి సినిమా కావడంతో రెండో ఆలోచన లేకుండా కియారా ఈ సినిమాకు ఓకే చెప్పిందట.
ఇక తమిళ సోయగం సాయిపల్లవికి తెలుగునాట వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చక్కటి అభినయంతో పాటు అద్భుత నృత్య ప్రతిభతో ఈ సుందరి యువతరంలో తిరుగులేని పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి హీరో నానితో రెండోసారి ఆడిపాడుతోంది. ఈ జంట తొలి చిత్రం ‘ఎం.సీ.ఎ’ మంచి విజయాన్ని సాధించింది. నాని-సాయిపల్లవి జోడీకి అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సక్సెస్ఫుల్ పెయిర్‌ను ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో రిపీట్ చేస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఆమె ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.
తెలుగు తెరపై పోతపోసిన అందాలరాశిగా భాసిల్లుతోంది పంజాబీ సోయగం రాశీఖన్నా. ఈ బొద్దుగుమ్మ ఇటీవలకాలంలో నాజూకు రూపాన్ని సంతరించుకొని కుర్రకారుని మురిపిస్తోంది. ‘థాంక్యూ’ సినిమా ద్వారా ఈ అమ్మడు నాగచైతన్యతో మూడోసారి జత కడుతోంది. ‘మనం’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన రాశీఖన్నా..‘వెంకీమామ’ చిత్రంలో చైతూతో నాయికగా జతకట్టింది. ప్రస్తుతం ఈ జంట కలిసి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నారు. గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడంతో చైతన్య-రాశీఖన్నా జోడీని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు.
‘మహర్షి’ చిత్రంలో కాలేజీ విద్యార్థులుగా ఆకట్టుకున్నారు మహేష్‌బాబు-పూజాహెగ్డే. ఈ జోడీ తెరపై అభిమానుల్ని కనువిందు చేసింది. ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా చక్కగా పండాయి. దీంతో ఈ అట్రాక్టివ్ పెయిర్ సిల్వర్‌స్క్రీన్‌పై మరోసారి సందడిచేయడానికి సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గూఢచారి నేపథ్య ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో పూజాహెగ్డేను కథానాయికగా ఎంపిక చేశారు. మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్‌తో రెండో సినిమా చేయబోవడం ఆనందంగా ఉందని, తమ జోడీ అభిమానుల్ని ఆకట్టుకుంటుందని పూజాహెగ్డే చెప్పింది.