Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందన్నారు. సంధ్య థియేటర్ సిబ్బంది ఈ నెల 2న చిక్కడపల్లి పీఎస్‌లో దరఖాస్తు చేశారని.. ఈ నెల 4న పుష్ప-2 విడుదలవుతుందని చెప్పారన్నారు. హీరో, హీరోయిన్, సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని అందులో పేర్కొన్నారని.. బందోబస్తు కావాలని పోలీసులను థియేటర్ యాజమాన్యం కోరిందన్నారు. ఈ నెల 3న సంధ్య థియేటర్ రాసిన లేఖకు పోలీసులు రాతపూర్వక సమాధానం ఇచ్చారని, సంధ్య థియేటర్‌కి వెళ్లి రావడానికి ఒకే మార్గం ఉందని చెప్పారన్నారు. థియేటర్ చుట్టు పక్కల ఇతర థియేటర్లు, రెస్టారెంట్లు ఉన్నాయని.. థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని పోలీసులు చెప్పినట్లుగా సీఎం పేర్కొన్నారు.
వచ్చే జనాలను నియంత్రించడం సాధ్యం కాదని చెప్పారని.. సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖను పోలీసులు తిరస్కరించారన్నారు. ఈ నెల 2న థియేటర్ యాజమాన్యం లేఖ ఇస్తే 3న తిరస్కరించారని.. వాహనం రూఫ్టాఫ్ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీ చేశారని.. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ థియేటర్‌కు రావొద్దని చెప్పామన్నారు. థియేటర్‌కు ఉన్నది ఒకేదారి.. వేలాది మందిని నియంత్రించలేమని చెప్పారని, పోలీసులు దరఖాస్తు తిరస్కరించినా రాత్రి 9.30 సమయంలో హీరో థియేటర్‌కు వచ్చారన్నారు. నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదో లేదో నాకు తెలియదని.. ఎక్స్‌రోడ్ చౌరస్తా ముందు నుంచే రూఫ్టాఫ్ ద్వారా రోడ్‌షో చేస్తూ థియేటర్‌కు వచ్చారన్నారు. ఆ సమయంలో చుట్టూ ఉన్న ఎడెనిమిది థియేటర్లలోని అభిమానులు ఇక్కడికే వచ్చారని.. హీరో కారు లోపలకు పంపించేందుకు గేట్లు తెరిచారన్నారు. హీరోను కలిసేందుకు వేలాది ఒకేసారి థియేటర్ వైపు వచ్చారని.. ఆ సమయంలో జరిగిన ఘటనలో రేవతి చనిపోయారని తెలిపారు.
ఈ ఘటనలో తల్లి చనిపోయింది.. కుమారుడు చికిత్స పొందుతున్నాడని.. తోపులాటలో పిల్లాడికి బ్రెయిన్‌డెడ్ అయ్యిందని పేర్కొన్నారు. హీరో వద్దకు వెళ్లి చెప్పేందుకు ఏసీపీని కూడా థియేటర్ సిబ్బంది వెళ్లనివ్వలేదని.. థియేటర్ సిబ్బంది తీరుపై ఆగ్రహించి చివరకు హీరో వద్దకు వెళ్లారన్నారు. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని హీరోను ఏసీపీ కోరారని సీఎం చెప్పారు. థియేటర్ బయట ఉన్న పరిస్థితి దృష్ట్యా డీసీపీ నేరుగా హీరో వద్దకు వెళ్లారని.. బయట ఒకరు చనిపోయారు.. మీరు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారన్నారు. మీరు వెళ్లకపోతే పీఎస్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుందని హీరోకు చెప్పారని.. రాత్రి 12 గంటలకు థియేటర్ నుంచి బయటకు వచ్చారన్నారు. తల్లి చనిపోయింది.. బాలుడు చావుబతుకుల మధ్య ఉన్నారని అల్లు అర్జున్‌కు చెప్పారన్నారు.
ఈ ఘటనలో కేసు నమోదు చేసి, కొంతమందిని అరెస్టు చేశారని చెప్పారు. ఘటన తర్వాత 11 రోజులు హీరో ఇంటికి వెళ్లారని.. కేసు నమోదు అయ్యిందని హీరోకు పోలీసులు చెప్పారన్నారు. ఘటనలో ఏ 11గా కేసు నమోదయ్యిందని చెప్పారని.. పోలీసుల పట్ల హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని.. విచారణలో భాగంగా హీరోను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారన్నారు. హీరోను పీఎస్‌కు తీసుకెళ్తుంటే కొందరు నేతలు నన్ను తిడుతూ పోస్టులు పెట్టారన్నారు. రూ.30వేల ఉద్యోగం చేసుకునే వ్యక్తి రూ.12వేలతో సినిమా టికెట్లు కొని సినిమాకు వెళ్లారని.. కుమారుడు అల్లు అర్జున్ అభిమాని అని సినిమాకు తీసుకెళ్లాడన్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతా రహితంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. 11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో, నిర్మాత వెళ్లలేదని.. బాధిత కుటుంబాన్ని హీరో, నిర్మాత పరామర్శించలేదన్నారు. ఒక్క రోజు హీరో జైలుకు వెళ్లి వస్తేనే.. సినిమావారంతా ఇంటికి పరామర్శలకు క్యూ కట్టారని.. అల్లు అర్జున్‌కు ఏమైనా కన్ను పోయిందా..? కాళ్లు పోయాయా? చేతులు పోయినవా..? కిడ్నీలు కరాబైనయా? ఎందుకు వెళ్లారు? అక్కడ ఒక తల్లి చనిపోయింది.. కొడుకు బ్రెయిన్‌డెడ్‌తో ఆసుపత్రిలో ఉన్నడు.. ఒక్కరైనా పరామర్శకు వెళ్లివచ్చారా? ఆయన టాలీవుడ్ ప్రముఖులపై మండిపడ్డారు.