Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన రూ. 1 కోటి విరాళం అందజేశారు. ఈ నిధి రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని చిరంజీవి తెలిపారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును చిరంజీవి స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “చిరంజీవి ఎప్పుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రజల కోసం, సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయం,” అన్నారు.
చిరంజీవి విరాళం ప్రకటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు “చిరు రియల్ హీరో” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆరోగ్య సేవలు వంటి అనేక సామాజిక సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇలాంటి విరాళాలు మరికొందరిని కూడా సహాయక చర్యలకు స్ఫూర్తినిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, వైద్య సాయం, నేత్రదానం చేస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు చిరు అందించిన ఈ విరాళం ఆయనకు ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని అంటున్నారు.
చిరంజీవి ఇటీవలే తన 70వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్ లైన్‌ను ఫిక్స్ చేశారు. నయనతార, కేథరీన్లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి ఈ మూవీని తీసుకొచ్చేలా చిత్ర బృందం గట్టిగానే కృషి చేస్తుంది. మరోవైపు చిరు నటించిన విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది.