‘మన శంకర వరప్రసాద్‌గారు’ ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు 260కోట్ల మార్కుకు దాటేశాయి. ఇది ఎక్కడికెళ్లి ఆగుతుందో అంతుచిక్కని పరిస్థితి. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజా సమాచారం ప్రకారం ఈ సందట్లోనే తన 158వ సినిమాక్కూడా ఆయన కొబ్బరికాయ కొట్టేయనున్నారట. బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ నెల 25న ఈ సినిమా పూజా కార్యక్రమాలు అధికారికంగా జరిగే అవకాశం ఉందని తెలిసింది. చిరంజీవి ‘విశ్వంభర’ ఈ సమ్మర్లో విడుదల కానున్నది.
ఈ సినిమా తర్వాత ఆయన ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల సినిమాను పట్టాలెక్కిస్తారు. ఆ తర్వాత బాబీ సినిమా ఉంటుంది. ఈసారి మెగాస్టార్‌ని డైరెక్టర్ బాబీ మాస్ అవతార్‌లో చూపించనున్నారని, ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని, చిరంజీవిని కొత్తగా చూపించాలనే కసితో బాబీ ఈ కథ రాసుకున్నారని తెలిసింది. కెవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ, లోహిత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.