మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగరోజే. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ రోజున ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతాకాదు. వారందరి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మెగా అప్డేట్ని ‘విశ్వంభర’ టీమ్ విడుదల చేసింది. ఈ సినిమా కోసం కోట్లాదిమంది మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ను విడుదల చేయనున్నట్టు గురువారం మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ ‘మీ అందరి ముందుకు ఇలా రావడానికి కారణం ‘విశ్వంభర’.
ఈ సినిమా ఆలస్యం మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు. అయితే.. ఈ అలస్యం సముచితమని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంది. అత్యున్నతమైన ప్రమాణాలతో, బెస్ట్ క్వాలిటీతో మీకు అందివ్వాలన్నదే మా ప్రయత్నం. ఇక సినిమా విషయానికొస్తే.. ఓ అద్భుతమైన చందమామకథలా ఉంటుంది.
చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్నపిల్లలకు ఇంకా నచ్చుతుంది.’ అని తెలిపారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, అషికా రంగనాథ్, కునాల్ కపూర్, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, భీమ్స్ సిసిరోలియో, దర్శకత్వం: వశిష్ట, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.