చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటైర్టెనర్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకుడు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘When Myths Collide Legends Rise’ అనే కోట్తో వున్న ఈ పోస్టర్లో చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని అత్యంత శక్తిమంతంగా కనిపిస్తున్నారు.
చిరంజీవి కూర్చున్న కొండ నుంచి వస్తున్న ప్రకాశమంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం, వాటిమధ్య చిరంజీవి చరిష్మాటిక్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉండబోతున్నదని ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చెప్పకనే చెబుతున్నది.
తొలి సినిమా ‘బింబిసార’తో ప్రయోగాత్మక ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్న వశిష్ట అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘విశ్వంభర’ను తీర్చిదిద్దుతున్నారని మేకర్స్ చెబుతున్నారు. త్రిష, అషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.