శుక్రవారం జరిగిన ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సమావేశంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సినిమా ఇండస్ట్రీ గురించి సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నదని ఆయన ఆవేదన చెందారు. అబద్ధపు ప్రచారాలతో సినిమాలను చంపేస్తున్నారని, విజయాల గురించి కూడా బహిరంగంగా చెప్పుకునే వీలు లేకుండా పోయిందన్నారు. తమన్ వ్యాఖ్యలపై అగ్ర నటుడు చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
‘డియర్ తమన్..నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. విషయం ఏదైనా..సోషల్ మీడియా వాడుతున్న ప్రతీ ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం సంబంధిత వ్యక్తులపై ఎలా ఉంటుందనే విషయం ఆలోచించాలి. మాటలు ఉచితమే..కానీ అవి కొందరిలో స్ఫూర్తినింపుతాయి.
ఇంకొకరిని నాశనం చేస్తాయి. కాబట్టి దేనిని ఎంచుకుంటామనేది నీపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది’ అని చిరంజీవి తన పోస్ట్‌లో తెలిపారు. చిరంజీవి పోస్ట్‌పై తమన్ స్పందించారు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్లు తెరిచే లోపే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అదని, చిరంజీవి మాటలు జీవితాంతం గుర్తుంటాయని తమన్ పేర్కొన్నారు.