‘మా ఊరిలో జరిగే జాతర ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ఇందులో ప్రతీ కుర్రాడి కథ కనిపిస్తుంది. నా వ్యక్తిగత అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి’ అన్నారు దర్శకుడు యదు వంశీ. నూతన తారాగణంతో ఆయన రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి నిహారిక కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరించగా శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ నిర్మించింది. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఈ కథ మీద చాలా రీసెర్చ్ చేశా. జయప్రకాష్ నారాయణ, పవన్‌కల్యాణ్ ప్రసంగాల్లోని అంశాల స్ఫూర్తితో కొన్ని సన్నివేశాలను డిజైన్ చేశాను. స్నేహంతో పాటు రాజకీయ అంశాలు కూడా ఈ కథలో ఉంటాయి. ’ అన్నారు. చిరంజీవిగారు ఈ సినిమా చూసి ప్రధానపాత్రధారుల అభినయాన్ని ప్రశంసించారని, వరుణ్‌తేజ్ కూడా మెచ్చుకున్నారని యదు వంశీ తెలిపారు. ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని, ఆ సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయని, మన ఊరు, మన జీవితం కళ్లముందు కదలాడుతుందని ఆయన పేర్కొన్నారు. తదుపరి చిత్రాన్ని థ్రిల్లర్ కథతో చేయబోతున్నానని, ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి విజయం సాధిస్తే, తాను అనుకున్న హీరోతో సినిమా ప్లాన్ చేస్తానని యదువంశీ వెల్లడించారు.