ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ ‘మన శంకర వరప్రసాద్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్’ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకులముందుకురానుంది. ఇదిలావుండగా చిరంజీవి కొత్త చిత్రం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న ప్రారంభం కానుంది. ఈ సినిమాకు బాబీ కొల్లి (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది.
‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ చిత్రం తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ‘మెగా158’ వర్కింగ్ టైటిల్‌తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కెవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.